గోదావరి ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకం ప్రధాన పంప్‌హౌస్, పిచ్చిమొక్కల నడుమ నిరుపయోగంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్లు
దిలావర్‌పూర్(నిర్మల్): బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు 13ఏళ్ల క్రితం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు అధికారుల పర్యవేక్షణ కరువై ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. కొన్నేళ్లుగా రైతులకు సాగు నీరందించని దుస్థితి నెలకొంది. ఇందుకు తార్కాణమే గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు.
దిలావర్‌పూర్ మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలైన దిలావర్‌పూర్, బన్సపల్లి, న్యూలలోంలోని బీడుభూములను సాగులోకి తెచ్చేందుకు 2003 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం బన్సపల్లి పరిసరాల్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి స్టేజ్–1 పనులు చేపట్టారు. దీని నిర్మాణంతో బన్సపల్లితో పాటు దిలావర్‌పూర్, న్యూలోలం గ్రామాలకు సాగు నీరందించేందుకు పంప్‌హౌస్‌లతోపాటు పైపులైన్ నిర్మాణాలు చేపట్టారు. న్యూలోలం గ్రామానికి 1250 ఎకరాల సాగు విస్తీర్ణానికి నీరందించేందుకు రూ.307.85 లక్షల వ్యయంతో పథకాన్ని నిర్మించారు. అలాగే బన్సపల్లి ఎత్తిపోతల పథకం స్టేజ్–1నిర్మాణానికి 800 ఎకరాల్లో సాగు నీరందించడానికి రూ.147.05 లక్షలు వెచ్చించారు.
మొదట రెండేళ్లు నీరందించడంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో పంప్‌హౌస్‌లోని మోటార్లు తరచూ మొరాయించడం, అధికారుల తోడ్పాటు కరువవడంతో ఆయకట్టు రైతులు విసుగుచెంది సాగుకు దూరమయ్యారు. గతంలో న్యూలోలం ఆయకట్టుకు నీరు సరిపోగా పక్క గ్రామమైన సిర్గాపూర్ గ్రామచెరువుకు సైతం నీటిని అందించారు. తదనంతరం పథకం పునరుద్ధరించాలని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నా నేతల నుంచి గానీ, అధికారుల నుంచి స్పందన కరువవడంతో చేసేదిలేక రైతులు ఆశలు వదులుకున్నారు.
దిలావర్‌పూర్‌ది ఇదీ పరిస్థితి..
మండలకేంద్రంలో మొదటి స్టేజీ ఎత్తిపోతల పథకం కింద 1500 ఎకరాలకు, రెండో స్టేజీకింద 650 ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.423.05లక్షలు, మూడో స్టేజీ కింద 225 ఎకరాలకు సాగునీరందించేందు రూ.63.46 లక్షలు వెచ్చించి నిర్మించిన పథకాలు నేడు అలంకారప్రాయంగా మారాయి.
పథకాలు సమర్థవంతంగా పనిచేసేందుకు సరైన పైపులైన్ ఉండాలి. దిలావర్‌పూర్ మొదటిస్టేజీ నిర్మాణం నుంచి రెండోస్టేజీ వరకు పైపులైన్ పనులు సక్రమంగా జరిగాయి. అయితే రెండు, మూడో స్టేజీలకు సంబంధించి ప్రారంభం నుంచి తరచూ పైపులైన్ లీకేజీల కారణంగా ఏడాది కూడా రైతులకు నీరందని పరిస్థితి. పైపులైన్ మార్చి నిర్మించాలని పలుమార్లు రైతులు మొరపెట్టుకున్నా పథకంపై పాలకులు స్పందించడం లేదని తెలుస్తోంది.
తుప్పు పడుతున్న మోటార్లు
ఎళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు మూలనపడడంతో అందుకు సంబంధించిన కొన్ని పరికరాలు చోరీకి గురవుతుండగా మోటార్లన్నీ తుప్పుపట్టిపోతున్నాయి. ఈ పథకాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, సామగ్రి సైతం అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎత్తిపోతల పథకాల మరమ్మతు కోసం తోడ్పాటునందించి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు.
ఎందుకు పనికి రాకుండాపోయింది
దిలావర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ఆదినుంచి తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. పథకం నిర్మాణ సమయంలో రైతు ల అవసరాలు గమనించక కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పైపులైన్ నిర్మాణాలు చేపట్టడంతో రైతులకు ఎంతమాత్రం సాగునీరు అందలేదు. తరచూ పైపులైన్‌లు పగలడంతో పథకం మూలన పడింది. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలి.
– ఆర్.నర్సయ్య, రైతు, దిలావర్‌పూర్
ప్రభుత్వం తోడ్పాటునందించాలి
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టిసారించి వాటిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలి. గ్రామాల్లో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈమేరకు చర్యలు చేపడితే పథకాలు సమర్థవంతంగా పనిచేసి రైతులకు సాగు నీరు అందే అవకాశం ఉంటుంది.
– రవి, రైతు, బన్సపల్లి
Comments
Please login to add a commentAdd a comment