సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడి పథకం ద్వారా రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వర్షాకాలం పంటలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు నవంబర్ 18 నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకానికి అవసరమైన నిధులను బడ్జెట్‌లోనే కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశంలో మరే రాష్ట్రం అమలు చేయనన్ని కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకే నిధుల సమస్య రాకుండా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుగుణంగా ముసాయిదా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. మండల రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సులను ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సదస్సులో వివరిస్తామని సీఎం వెల్లడించారు. 25న హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
త్వరలోనే రాష్ట్ర రైతు సమితి
42 మంది సభ్యులతో త్వరలోనే రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అన్ని జిల్లాలకు భాగస్వామ్యం ఉండేలా 30 జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులను కమిటీలో సభ్యులుగా నియమిస్తామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారిని సభ్యులుగా నియమించాలని, వారి పేర్లు సూచించాలని పేర్కొన్నారు.
ఏయే జిల్లాలు ఎక్కడ?
హైదరాబాద్‌లో జరిగే ప్రాంతీయ సదస్సుకు జనగామ, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మండల రైతు సమన్వయ సమితి సభ్యులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. 26న కరీంనగర్‌లో జరిగే సదస్సుకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు చెందిన సభ్యులను ఆహ్వానించాలని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సదస్సులో రైతులతో సీఎం నేరుగా మాట్లాడతారు. సదస్సులకు హాజరయ్యే మండల రైతు సమన్వయ సమితుల సభ్యుల ప్రయాణ, భోజన సదుపాయాలను వ్యవసాయ శాఖ సమకూర్చాలని సీఎం చెప్పారు. రైతులను సంఘటితం చేయడం, రైతు వేదికల నిర్మాణం–నిర్వహణ, రైతులకు నిరంతర శిక్షణ, పెట్టుబడి పథకం, కనీస మద్దతు ధర అందేలా చూడడం, మార్కెట్లకు ఉత్పత్తులు తీసుకొచ్చే సమయంలో నియంత్రణ పాటించడం, మేలైన సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవసాయ విధానం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ చైన్, క్రాప్ కాలనీలు తదితర అంశాలపై సదస్సుల్లో విస్తృతంగా చర్చించాలని సీఎం సూచించారు.
సబ్సిడీపై వరి నాటు యంత్రాలు
ప్రస్తుతం వ్యవసాయదారులు కూలీల కొరతను ఎదుర్కొంటున్నారని, భవిష్యత్‌లో ఈ సమస్య మరింత ఎక్కువవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. వరినాట్లు వేసే యంత్రాలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బాల్క సుమన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment