
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పదవి రేసులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారా? ఆయన స్వయంగా ఈ కుర్చీని ఆశిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న ఆయన పేరు టీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ పదవిలో కొనసాగిన నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి.. తాజాగా శాసనమండలి చైర్మన్‌గా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా మరొకరిని నియమించాల్సి ఉంది. సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సైతం చెబుతుండడం మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్ పట్నం వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. మొన్నటి వరకు ఆ స్థానంలో రెడ్డి సామాజిక వర్గ నేత ఉండటంతో.. త్వరలో జరిగే నియామకంలోనూ అదే వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టే ఆలోచన ఉందనే చర్చ జరుగుతోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసి ఒక దఫా మంత్రిగా సేవలందించిన ఆయనకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మహేందర్‌రెడ్డి ఎంతో బలమైన నేతగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే ముందే కేసీఆర్ మీద ఉన్న నమ్మకంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment