
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలో నియమించనున్నట్లు సీఎం ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా ఉన్న పల్లా.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పార్టీ ఇన్‌చార్జిగానూ వ్యవహరించారు. మంత్రివర్గ విస్తరణలో పల్లాకు చోటు దక్కుతుందని భావించినా, సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం దక్కకపోవడంతో మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే గతంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పల్లాకు అవకాశం కల్పించారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి..
మున్సిపల్ ఎన్నికల తర్వాత పదవుల పందేరం ఉంటుందని భావించినా, ఎన్నికల నిర్వహణపై స్పష్టత రావడం లేదు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా ఆ పదవులను ఆశిస్తుండటంతో తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో చోటు కోసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా కార్పొరేషన్లు ఉండగా, అందులో 30 కార్పొరేషన్లు కీలకమైనవి కావడంతో ఆశావహులు తెలంగాణ భవన్, ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 189 మార్కెట్ కమిటీలకు గాను ప్రస్తుతం 96 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లు లేవు. మరోవైపు సుమారు 4 వేలకు పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది.
పల్లాకు కేసీఆర్ అభినందన..
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా తన నియామకంపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. పల్లాను అభినందించిన ఆయన.. రైతులకు అండగా ఉండేలా రైతు సమన్వయ సమితిలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. వచ్చే జూన్‌లోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేయాలన్నారు. సమితిల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం వంటి అంశాలపై మూడు నాలుగు రోజుల్లో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment