ముత్తిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై పీటముడి ఇంకా వీడలేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఒక్క స్థానంపై కమిటీ మరోసారి సమావేశమై 25న నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో జనగామ నుంచి బరిలో నిలిచే బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థిత్వం ఖరారుపై గడువు పెరిగిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు ఎవరికి వారుగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది.
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి పేరు వినిపించగా.. జనగామకు ఏడాదిన్నరగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరే వినిపించింది. అయితే హఠాత్తుగా జనగామ నుంచి పోటీ చేసేందుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం గందరగోళానికి దారితీసింది. ఇదే సమయంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అనుచరులు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో రహస్యభేటీ నిర్వహించగా.. అక్కడికి వెళ్లిన యాదగిరిరెడ్డి ఇది కరెక్టు కాదని పార్టీ నాయకులకు నచ్చజెప్పారు.
ఆ తర్వాత ముత్తిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా, సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారన్న సమాచారం మేరకు ఉదయమే హైదరాబాద్‌కు వెళ్లిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలసినట్లు సమాచారం.
అలాగే పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల అనుచరులు సైతం హరీశ్‌రావును కలసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు కూడా వేర్వేరుగా పార్టీ పెద్దలను కలసినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఈ స్థానంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. 25న ఎన్నికల కమిటీ మరోసారి భేటీ అయి అభ్యర్థి పేరును ఖరారు చేస్తుందని ప్రకటించారు.
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఫైనల్‌గా తనకే ఛాన్స్ ఉంటుందని చెపుతుండగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం ధీమాగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చాకే ఈ వివాదం పరిష్కారం అవుతుందన్న మరో వాదన పార్టీ ముఖ్యనేతల నుంచి వినిపిస్తోంది. 25న అభ్యర్థుల ఎంపిక కమిటీ భేటీ అయినప్పటికీ.. సెప్టెంబర్ 1న కేటీఆర్ వచ్చాకే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment