సాక్షి, మెదక్: రాజకీయ భవిష్యత్తుకు బాట వేసే రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్ష పదవిపై పలువురు నేతలు కన్నేశారు. జిల్లా రైతు సమన్వయ సమితి ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం కావడంతో ఆశావహులు ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో జిల్లా రైతు సమన్వయ సమితి ఏర్పాటు కానుంది. అధ్యక్షుడు, సభ్యుల నియామకంలో నీటిపారుదల శాఖా మంత్రి టి.హరీశ్‌రావు నిర్ణయమే ఫైనలంటున్నారు పలువురు నాయకులు. మంత్రి ప్రతిపాదించిన వారికే అధ్యక్ష పదవితోపాటు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీల్లో స్థానం దక్కనుందన్న సమాచారం. దీంతో మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు.
జిల్లా అధ్యక్షుడి పదవి దక్కితే భవిష్యత్తులో రాజకీయంగా ఉపయోగపడుతుందని భావిస్తున్న వారు పదవి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీటి ద్వారా ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్ వ్యవహారాల్లో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ఈ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇది వరకే గ్రామ స్థాయిలో 15 మంది సభ్యులు, మండల స్థాయిలో 24 మంది సభ్యులతో రైతు సమితిలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 381 రెవెన్యూ గ్రామాలు, 20 మండలాలతో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 24 మంది సభ్యులతో జిల్లా సమితి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఈ వారం చివరి వరకు జిల్లా సమితి ఏర్పాటు కొలిక్కిరానుంది.
జిల్లా కమిటీలది కీలక పాత్ర
రైతు సమన్వయ సమితుల్లో జిల్లా కమిటీలది కీలకపాత్ర కానుంది. ఈ కమిటీ పరిధిలోని మండల, గ్రామ కమిటీలు పనిచేయాల్సి ఉంటుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సమితులు పూర్తయిన తర్వాత వీటికి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రతి జిల్లా సమితికి నిధులు కేటాయించి వాటి ద్వారా మండల, గ్రామ కమిటీలకు నిధులు ఖర్చు చేసే బాధ్యతను అప్పగించనున్నట్లు సమాచారం. గ్రామాల్లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయటం, అమ్మడం బాధ్యతలు జిల్లా కమిటీ పర్యవేక్షించనుంది. పంటల సాగుపై రైతులకు శిక్షణ తరగతుల నిర్వహణ, వ్యవసాయ అధికారులతో సమావేశాలు, పంట కాలనీల ఏర్పాటు, ఎరువుల పంపిణీలో సైతం జిల్లా కమిటీ బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చే సాగు పెట్టుబడి రూ.4వేలు కూడా వీరి ద్వారా అందజేయనుంది. ఈ చెక్కులు ఆర్హులైన రైతులకు సకాలంలో అందేలా జిల్లా కమిటీల పర్యవేక్షణ చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్ నుంచి జిల్లా, మండల, గ్రామ సమితులు రైతులతో కలిసి పనిచేయనున్నాయి.
రైతు సమస్యలు తెలిసిన వారికే..
జిల్లా రైతు సమన్వయ సమితి కోసం పలువురు పోటీ పడుతున్నట్లు సమాచారం. పాపన్నపేట మండల సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు టి. సోములు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే శివ్వంపేట మండల సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కౌడిపల్లి సమన్వయక కమిటీ అధ్యక్షుడు రామాగౌడ్‌లు జిల్లా సమితి అధ్యక్ష పదవికోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యవసాయంపై అవగాహన ఉండి, రైతు సమస్యలు తెలిసి ఉన్న వారికి జిల్లా సమితి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని మంత్రి హరీశ్‌రావు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లా కమిటీ సభ్యులుగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి భాగస్వామ్యం ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Published Fri, Feb 9 2018 6:09 PM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment