
భూస్కాంపై ఎట్టకేలకు కదిలిన కాంగ్రెస్
► గవర్నరుకు ఫిర్యాదు... అనంతరం సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల స్కాంపై ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్‌పార్టీ ఎట్టకేలకు కదిలింది. దాదాపు 20 రోజులుగా రోజుకో కొత్త సంచలనంతో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్న భూముల కుంభకోణంపై ప్రధాన ప్రతిపక్షపార్టీగా స్పందించడంలేదని స్వంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఏఐసీసీ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో భూకుంభకోణంలో కీలక పాత్రధారులకు సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లనే టీపీసీసీ కొంత ఉదాసీనంగా వ్యవహరించినట్టుగా కాంగ్రెస్‌పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే రాష్ట్రంలో మిగిలిన రాజకీయపార్టీలు టీపీసీసీ కన్నా వేగంగా, చురుకుగా వ్యవహరిస్తున్న సమయంలో టీపీసీసీ కూడా కదలాల్సి వచ్చినట్టుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధానప్రతిపక్షపార్టీగా ఈ కుంభకోణంపై మొక్కుబడి ప్రకటనలకే పరిమితమై, ఇంకా తాత్సారం చేస్తే పార్టీపై అనుమానాలు పెరుగుతాయనే పార్టీ నేతల హెచ్చరికలతో టీపీసీసీ కదలాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ భూకుంభకోణంపై జాతీయస్థాయి నేతల జోక్యంతోనే టీపీసీసీ కొంత నెమ్మదిగా, చూసీచూడనట్టుగా వ్యవహరించిందనే వాదనను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొట్టి పారేస్తున్నారు.
ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ జూన్ 1న మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ కుంభకోణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్యులు ఉన్నారని తాము ఇచ్చిన సమాచారంతోనే దిగ్విజయ్‌సింగ్ మాట్లాడినట్టుగా చెబుతున్నారు. అయితే ఆ తరువాత కాలంలో అదే వేగాన్ని కొనసాగించడంలో ఎందుకు వెనుకబడ్డారనే పార్టీ నేతల ప్రశ్నకు బదులు ఇవ్వడంలేదు. అయితే ఏదేమైనా ఈ భూకుంభకోణంపై టీపీసీసీ ఎట్టకేలకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. దీనిపై భవిష్యత్ కార్యాచరణకు దిగాలని భావిస్తోంది.
గవర్నరుతో భేటీ... అనంతరం సీఎల్పీ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూములపై సీబీఐ విచారణ కోరాలనే డిమాండుతో రాష్ట్ర గవర్నరును టీపీసీసీ బృందం గురువారం భేటీ కానుంది. దీనికోసం గవర్నరు సమయాన్ని కూడా తీసుకున్నారు. గవర్నరుకు ఫిర్యాదు చేసిన అనంతరం కాంగ్రెస్‌పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. భూముల కుంభకోణంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
భూములను దోచుకుంటున్న సీఎం
తెలంగాణలోని ప్రభుత్వ భూములను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మియాపూర్‌లోని సర్వే నెంబర్ 100 ను పరిశీలించి అక్కడే విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్‌లోని భూముల కుంభకోణం జరిగిన సర్వే నెంబర్‌లలోని 760 ఎకరాల స్థలాన్ని డబుల్ బెడ్ రూం పథకానికి కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర భారతదేశంలో అతిపెద్ద భూకుంభకోణంగా ఆయన అభివర్ణించారు.
వేలాది కోట్ల విలువైన భూములను కేవలం అధికారులే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయలేదని, ప్రభుత్వ పెద్దల హస్తం ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద భూకుంభకోణం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్థలాలు అన్యాక్రాంతం కాలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కీలక పదవులలో ఉన్న నాయకులు ఖజానాను కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం సన్నిహితుడు దామోదార్‌రావు అల్లుడు ప్రభుత్వ భూములను అక్రమించిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ వారి కార్యాలయంలో పనిచేస్తున్నారన్నారు.
సీఎం కార్యాలయంలో పనిచేసే వారు, ఆత్మీయులు, బంధువుల పాత్ర భూకుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నా ఏమి జరగలేదనడం సిగ్గు చేటన్నారు. కూకట్‌పల్లిలో 80 డి సర్వే నెంబర్‌లోని నాలుగు ఎకరాలు రెడ్డినాయక్ కూతురు ఎన్.కవితకు రిజిస్ట్రేషన్ చేయించడం నిజం కాదా ..? కూకట్‌పల్లి సర్వే నెంబర్ 1లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ అక్రమించిన భూములను మాధవరం కృష్ణారావు ముఖ్య అనుచరులు పి.వి. రాజు అండ్ బ్రదర్స్ డెవలఫ్‌మెంట్‌కు తీసుకోవడం నిజం కాదా...? కేశవరావు కూతురు, కోడలు పేరిట 38 ఎకరాలు భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజం కాదా...? కూకట్‌పల్లిలోని 163 సర్వే నెంబర్‌లోని భూములను సీఎం కుటుంబీకులు, బీనామీల పేర్ల మీద నాలుగు ఎకరాలు ఉండడం నిజం కాదా..?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయాన్ని భ్రష్టుపట్టిస్తోందన్నారు. సీఎం కుటుంబ సభ్యులకు, మంత్రులకు, ఐఏఎస్ అధికారుల పేర్ల మీద భూములను రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఎస్.కె. సింహా భూముల విషయంలో రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేశారు. దీనిని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద భూకుంభకోణం జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికారులు పరిశీలనకు రాకపోవడం హాస్యాస్పదం. నూతన రాష్ట్రంలో పరిపాలనలో పారదర్శకత,, నిజాయితీ ఉంటుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ మూల్యమైన భూములను పాలించేవారే దోచుకుంటున్నారని విమర్శించారు. ఏం మతులబు జరిగిందో కానీ సీఎం స్వయంగా ఏం జరగలేదని చెప్పడంతో ప్రజలు వింతగా చూస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం పారదర్శకత కోసం, అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రజల కోసం సీబీఐ ద్వారా విచారణ చేసి విషయాలను వెల్లడి చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని శాసన సభాపక్ష నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఇకముందు ప్రజలే తగిన సమయంలో బుద్ది చెబుతారన్నారు. సీఎం వచ్చాక ఎన్నో సీఐడీ విచారణలు జరిపారని ఎన్ని ఫలితాలు వచ్చాయని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, నహీమ్ కేసు, ఎంసెట్ లీకేజీ ఇలాంటివి ఎన్నో ఉన్నావని మరల సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడం అలవాటేనన్నారు. ఒక్క గజం కూడా పోలేదని, ఏ సంస్థ చెప్పిందని ప్రశ్నించారు.
అన్ని పార్టీలు సీబీఐ విచారణ జరపాలని అడుగుతున్నారని, దీని పై సీబీఐ విచారణ చేపడితే మంచిదని మాజీ రాజ్యసభ సభ్యుడు హన్మంత్‌రావు అన్నారు. మాటల గారడీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, అధికార ప్రతినిధి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేలు ఎం. భిక్షపతియాదవ్, సుధీర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రవికుమార్‌యాదవ్, కాంగ్రెస్ మహిళ విభాగం అధ్యక్షురాలు నీరల శారదా, అధికార ప్రతినిధి రమ్యరాయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.