టీఆర్‌ఎస్ తీరు అప్రజాస్వామికం | congress leader batti fire on trs govt | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ తీరు అప్రజాస్వామికం

Published Sun, Nov 16 2014 12:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్ తీరు అప్రజాస్వామికం - Sakshi

టీఆర్‌ఎస్ తీరు అప్రజాస్వామికం

కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్: ‘రాష్ట్ర శాసనసభలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విపక్ష సభ్యులను గౌరవించకుండా, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాం..’ అని టీపీసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేలా  సమయం ఇవ్వాలని మరో మారు స్పీకర్‌ను కోరదలిచాం అని తెలిపారు. అలాగే, ఒక పార్టీ తరపున గెలిచిన వారిపై ఒత్తిళ్లు పెట్టి తమ పార్టీలో చేర్చుకునే దుష్ట సంప్రదాయాన్ని టీఆర్‌ఎస్ మొదలు పెట్టిందని విమర్శించారు.

ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, మరోమారు స్పీకర్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు. పార్టీ మారిన సభ్యులు ఏకంగా అధికార పక్షానికి చెందిన బ్లాక్‌లో కూర్చుంటున్నారని, ఇదే పెద్ద ఆధారమని అన్నారు. చర్యలు తీసుకోకుంటే, ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటామని, కానీ, పరిస్థితి అంతదాకా వస్తుందని అనుకోవడం లేదన్నారు. తమ పార్టీకి చెందిన విఠల్‌రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్ పార్టీ మారారని, రెడ్యానాయక్ మాత్రం అధికార పక్షం బ్లాక్‌లో కూర్చుని మాట్లాడారని చెప్పారు. వీరిపై చర్య తీసుకోవాల్సిందేనని భట్టి డిమాండ్ చేశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement