VIKRAMARKA Bhatti
-
మీ స్కీంల స్కాంలు దేశంలోనూ అమలు చేస్తారా?
మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు స్కీంల పేరిట చేసిన స్కాంలను బీఆర్ఎస్ పార్టీ తో దేశం మొత్తం అమలు చేస్తారా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని సహజ వనరులను కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పోడు హక్కులను కాలరాసిందని ధ్వజమెత్తారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ సాక్షిగా కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే దళితబంధుకు ప్రత్యేకంగా నిధులు అవసరం లేదన్నారు. ఆ నిధులతోనే అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీలతోపాటు అభివృద్ధి పనులకు అవకాశం ఉండేదని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని భట్టి ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను మాత్రమే కట్టారని, దీని నుంచి ఒక్క ఎకరాకు కూడా నీరు పారడం లేదన్నారు. ప్రతి నెలా 1న జీతాలు రావడం లేదని, కార్మికుల వేతనాలను ఏడాదికి ఒకసారి సవరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని నిందించారు. ధరణితో భూమిపై హక్కు ఉన్న వారు హక్కులను కోల్పోవాల్సి వచ్చిందని, భూముల అమ్మకాలు, సింగరేణి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని భట్టి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామని అన్నారు. ఖర్గే హామీనివ్వడం అదృష్టం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సభా వేదికగా హామీనివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని భట్టి వ్యాఖ్యానించారు. బోథ్ నియోజకవర్గం పిప్రి నుంచి తాను పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒకట్రెండు రోజుల్లోనే ఆపేస్తారని అనుకున్నారని, కానీ ఇక్కడి ప్రజలు తనను అరచేతిలో పెట్టుకుని ముందుకు నడిపించారని చెప్పారు. 31 రోజులు సుదీర్ఘ పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో సక్రమంగా సాగేందుకు ఈ ప్రాంత ఆదివాసీల ప్రేమతో గిరిజనేతరులు, పార్టీ కార్యకర్తల సహకారమే కారణమన్నారు. పాదయాత్రను శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఖమ్మం వరకు కొనసాగిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కంచు కోటకు బీటలు
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం జిల్లాలో కారుజోరు కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు పడ్డాయి. మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారు టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 8 వార్డుల్లో 5 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ సీపీఐ తలఒక్క స్థానంలో గెలుపొందాయి. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజంలో ఉంది. దీంతో మధిర మున్సిపాలిటీపై తొలిసారి గులాబీ జెండా ఎగరేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించిన భట్టికి మరోసారి భారీ షాక్ తగిలినట్లయింది. (మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణి) గత ఏడాది ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిన్పటికీ.. ఖమ్మంలో మాత్రం చేదు ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, గులాబీ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించారు. దానికి తోడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా భట్టికి చెక్ పెట్టేందుకు మధిరపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 75కుపైగా టీఆర్ఎస్ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాలా : మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం చర్ల మండలంలోని కుదునూరులో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తొలగించేందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో దళిత, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. దొరల తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భద్రాచంల ఎమ్మెల్యే పోడెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో నియంత పాలన
అశ్వాపురం/పినపాక/కరకగూడెం : ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే లెక్క లేకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం ఆయన అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు మోసం చేసి పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఓట్లేసిన ప్రజల ఆదరాభిమానాలనుకేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టారని, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో లేకుండా చేయాలనే కుట్రతో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి సొమ్ముతో సంతలో కూరగాయల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారాలంటే ఆ పదవికి రాజీనామా చేయాలని, ఒకవేళ వారు రాజీనామా చేయకుంటే స్పీకర్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ రాష్ట్రంలో నేడు ఇవేమీ కనిపించడం లేదన్నారు. ఏదేమైనా కేసీఆర్ అరాచక పాలనను సాగనివ్వబోమని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని గణాంకాలతో బయటపెడుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనేక అక్రమాలు జరిగాయని, దీంతో ఫెయిలైన విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట భద్రాచలం, ములుగు ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య, నాయకులు చందా సంతోష్, జెడ్పీటీసీ అభ్యర్థులు గాదె పుష్పావతి, కె.అన్నపూర్ణ, ఎంపీటీసీ అభ్యర్థులు పోరెడ్డి విజయలక్ష్మి, బొగ్గం నాగమణి, నాయకులు గాదె కేశవరెడ్డి, నేలపట్ల సత్యనారాయణరెడ్డి, ఓరుగంటి భిక్షమయ్య, నజీర్షోను, తూము వీరరాఘవులు, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, రుక్నారావు, ఊకే రామనాథం, తొలెం నాగేశ్వరరావు, చిట్టిబాబు, కమలాకర్, మదార్‌సాహెబ్, టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు తుళ్లూరి ప్రకాష్‌రావు, అనంతనేని సురేష్, ఎంఏ.గఫార్ పాల్గొన్నారు. -
పాకిస్తాన్ క్రికెట్ టీమ్.. కాంగ్రెస్ టీమ్ ఒక్కటే : కేటీఆర్
సభలో ఏదీ నియమనిబంధనల ప్రకారం జరగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శించగా.. ఈ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి సూచనలను కాంగ్రెస్ సభ్యులు పాటించడం లేదని, పార్టీలోని అంతర్గత విభేదాలు సభలో బయటపడ్డాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఒక కెప్టెన్ ఉంటే 10 మంది మాజీ కెప్టెన్లు ఉండేవారని, ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీరు సైతం అలానే తయారైందని ఎద్దేవా చేశారు. దీనిపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి దీటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఉం దని, టీఆర్ఎస్లో కుటుంబ పాలన ఉందని విమర్శించారు. అధికార, విపక్షాల వాదోపవాదాల మధ్య స్పీకర్ మధుసూదనాచారి ఈ సుదీర్ఘ రచ్చకు తెరదీస్తూ సభను మధ్యాహ్న భోజన విరామం కోసం వాయిదా వేశారు. -
టీఆర్ఎస్ తీరు అప్రజాస్వామికం
కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్: ‘రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విపక్ష సభ్యులను గౌరవించకుండా, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాం..’ అని టీపీసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేలా సమయం ఇవ్వాలని మరో మారు స్పీకర్‌ను కోరదలిచాం అని తెలిపారు. అలాగే, ఒక పార్టీ తరపున గెలిచిన వారిపై ఒత్తిళ్లు పెట్టి తమ పార్టీలో చేర్చుకునే దుష్ట సంప్రదాయాన్ని టీఆర్ఎస్ మొదలు పెట్టిందని విమర్శించారు. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, మరోమారు స్పీకర్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు. పార్టీ మారిన సభ్యులు ఏకంగా అధికార పక్షానికి చెందిన బ్లాక్‌లో కూర్చుంటున్నారని, ఇదే పెద్ద ఆధారమని అన్నారు. చర్యలు తీసుకోకుంటే, ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కుంటామని, కానీ, పరిస్థితి అంతదాకా వస్తుందని అనుకోవడం లేదన్నారు. తమ పార్టీకి చెందిన విఠల్‌రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్ పార్టీ మారారని, రెడ్యానాయక్ మాత్రం అధికార పక్షం బ్లాక్‌లో కూర్చుని మాట్లాడారని చెప్పారు. వీరిపై చర్య తీసుకోవాల్సిందేనని భట్టి డిమాండ్ చేశారు.