మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు స్కీంల పేరిట చేసిన స్కాంలను బీఆర్‌ఎస్ పార్టీ తో దేశం మొత్తం అమలు చేస్తారా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని సహజ వనరులను కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, పోడు హక్కులను కాలరాసిందని ధ్వజమెత్తారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ సాక్షిగా కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే దళితబంధుకు ప్రత్యేకంగా నిధులు అవసరం లేదన్నారు. ఆ నిధులతోనే అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయినేజీలతోపాటు అభివృద్ధి పనులకు అవకాశం ఉండేదని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని భట్టి ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను మాత్రమే కట్టారని, దీని నుంచి ఒక్క ఎకరాకు కూడా నీరు పారడం లేదన్నారు.
ప్రతి నెలా 1న జీతాలు రావడం లేదని, కార్మికుల వేతనాలను ఏడాదికి ఒకసారి సవరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని నిందించారు. ధరణితో భూమిపై హక్కు ఉన్న వారు హక్కులను కోల్పోవాల్సి వచ్చిందని, భూముల అమ్మకాలు, సింగరేణి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని భట్టి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామని అన్నారు.
ఖర్గే హామీనివ్వడం అదృష్టం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సభా వేదికగా హామీనివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని భట్టి వ్యాఖ్యానించారు. బోథ్ నియోజకవర్గం పిప్రి నుంచి తాను పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒకట్రెండు రోజుల్లోనే ఆపేస్తారని అనుకున్నారని, కానీ ఇక్కడి ప్రజలు తనను అరచేతిలో పెట్టుకుని ముందుకు నడిపించారని చెప్పారు.
31 రోజులు సుదీర్ఘ పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో సక్రమంగా సాగేందుకు ఈ ప్రాంత ఆదివాసీల ప్రేమతో గిరిజనేతరులు, పార్టీ కార్యకర్తల సహకారమే కారణమన్నారు. పాదయాత్రను శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఖమ్మం వరకు కొనసాగిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment