సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని ఓ పండుగలా చేస్తుందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. భూ ప్రక్షాళన తర్వాత 9లక్షల తప్పులు దొర్లినట్లు సీఎం చెప్పారని, భూ ప్రక్షాళన పరిస్థితి.. కొండనాలుకకు మందేస్తే! ఉన్న నాలుక ఊడిపోయినట్లుందని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూ ప్రక్షాళన తప్పుల వల్ల చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, రైతు బంధు పథకం కంటే! మద్దతు ధర రైతులకు చాలా మేలు చేస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మద్దతు ధరతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం పేరు మార్చమంటే.. ఈ సర్కారుకు మనసు రావటంలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కూడా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన దాన్ని చూసి ఇవాళ టీఆర్‌ఎస్ ప్రకటించిందని తెలిపారు. కేసీఆర్ స్వయంగా సొంత నిర్ణయాలు తీసుకుని మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment