రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే.. | Congress Leader Comments On TRS Government Over Farmer Suicides | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..

Published Tue, Mar 20 2018 7:04 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

Congress Leader Comments On TRS Government Over Farmer Suicides - Sakshi

రైతు భరోసా యాత్రలో భాగంగా నాగలి ఎత్తుకొని పాదయాత్ర చేస్తున్న మాజీ చీఫ్‌విప్‌ గండ్ర

భూపాలపల్లి : రైతులు ఆరుగాలం శ్రమించినా వారిలో ఆనందం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పదవి చేపట్టిన వేళావిశేషంతో గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 40 రోజులపాటు చేపట్టనున్న ‘రైతు భరోసా’ పాదయాత్రను ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి మండలంలోని ఆజంనగర్‌లో సోమవారం ప్రారంభించారు. 

అంతకు ముందు భూపాలపల్లి నుంచి బయల్దేరిన ఆయన పట్టణంలోని  హనుమాన్‌ దేవాలయం, పంబాపూర్‌ శివాలయం, ఆజంనగర్‌లోని చెన్నకేశవ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆజంనగర్‌లో  కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా  గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గండ్ర మాట్లాడుతూ.. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకే ఉగాది మరునాడే కొత్త కోండ్రు ఆజంనగర్‌ నుంచి ప్రారంభించానన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల రుణాలను పావలా, ఆటానా మాఫీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయాలు రైతులకు  దోహదంగా ఉండేయన్నారు. 

గిట్టుబాటు ధరకు మించి పంటలను కొనుగోలు చేసే  వారన్నారు. గత ఏడాది రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ తాము వరంగల్‌ మార్కెట్‌ యార్డుకు వెళ్తే ప్రభుత్వం పోలీసులచే అరెస్ట్‌ చేయించిందన్నారు. పప్పు దినుసులు మేలని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అధికంగా పండించారని, ఇప్పుడు వాటిని కొనుగోలు చేసే వారే కరువయ్యారని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటారని ఆరోపించారు. భూరికార్డుల క్రమబద్ధీకరణతో వీఆర్వో నుంచి కలెక్టర్ల వరకు బాగుపడ్డారని, రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు చేపట్టిన తన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని గండ్ర కోరారు. 

వైఎస్‌ హయాంలో ఒకేసారి రుణమాఫీ : మాజీ మంత్రి శ్రీధర్‌బాబు 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేశారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. మాఫీకి ముందే రుణాలు చెల్లించిన రైతులకు సైతం రూ.5 వేలు అందించామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.4 వేలు అందించేందుకు వస్తుందన్నారు. అయితే బ్యాంకు రుణాలకు సంబంధించి రైతులు ఇప్పటి వరకు ఎంత వడ్డీ చెల్లించారో కాగితం తీసుకొని వచ్చి ప్రస్తుత ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు. 

టీఆర్‌ఎస్‌కు పుట్టగతులుండవు.. 
కాంగ్రెస్‌ను విమర్శిస్తే టీఆర్‌ఎస్‌కు పుట్టగతులుండవని కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి అన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసి ఈ పాదయాత్ర ప్రారంభించాడన్నారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై ఆజంనగర్, నాగారం, పంబాపూర్‌లో కొనసాగింది. పాదయాత్రకు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు దొమ్మాటి సాంబయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, కొత్త హరిబాబు, గడ్డం కుమార్‌రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, మందల విద్యాసాగర్‌రెడ్డి, గండ్ర హరీష్‌రెడ్డి, ఆకుల మల్లేష్, సెగ్గెం సిద్ధు, నూనె రాజు, గొర్రె సాగర్, పొలుసాని లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement