Gandra Venkata Ramana Reddy
-
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమపై భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో గత నెల 16న నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా కేసు పెట్టారని.. తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి పట్టణంలోని పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి గత నెలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, గండ్ర దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
బాధాతప్త హృదయంతో నిర్ణయం తీసుకున్నా!
భూపాలపల్లి: ‘నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశా.. పార్టీని వీడటం బాధగా ఉంది.. అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధాతప్త హృదయంతో తీసుకున్న నిర్ణయం ఇది’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం భూపాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో తన సతీమణి జ్యోతితో కలసి కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గండ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రం, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై తనతో పాటు తన భార్య జ్యోతి నిత్యం బాధ పడ్డామని చెప్పారు. గడిచిన నలభై రోజులుగా రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అధికార పార్టీలో చేరాలా వద్దా అని ఆలోచించామని పేర్కొన్నారు. చివరకు భూపాలపల్లిలో మెడికల్ కళాశాల, బైపాస్ రోడ్డు, లిఫ్ట్ ఇరిగేషన్, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనులను చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్లో చేరానని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలు వేరైనా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తాను అన్నదమ్ముల్లా మెదిలామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆహ్వానం మేరకు.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. పార్టీ మారుతున్న సందర్భంగా కార్యకర్తలకు సమాధానం ఇచ్చే క్రమంలో బాధ పడుతున్నానని గండ్ర గద్గద స్వరంతో మాట్లాడుతుండగా ఆయన సతీమణి జ్యోతి కంటతడి పెట్టారు. -
గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు శనివారం తన నివాసంలో విందు ఇచ్చిన ఆయన ఆ విందుకు హాజరుకాని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఆదివారం కలిశారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్‌లోని గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి.. అక్కడ చాలా సేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా గండ్ర పార్టీ మారే అంశంపై చర్చ జరిగింది. దీన్ని ఖండించిన గండ్ర తాను పార్టీ మారేది లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని భట్టికి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితు లు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సీఎల్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
సర్వతోభద్ర ఆలయం పునరుద్ధరణకు కృషి
సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి జయశంకర్ జిల్లా నైన్‌పాకలోని సర్వతోభద్ర ఆలయ పునరుద్ధరణను తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. చిట్యాల మండలంలోని నైన్పాక ఆలయం విశిష్టతపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం ‘దేవుడు ఎదురు చూడాల్సిందే..!’శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆలయ విశిష్టతలను తొలిసారిగా సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆలయ ప్రత్యేకతలను ప్రజలకు తెలియజేయడానికి ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నైన్‌పాకలో నిర్వహించారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ హెరిటేజ్ (ఇంటాక్) ఆధ్వర్యాన గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. కాకతీయుల కాలంలో కర్ణాటక నుంచి ఒరిస్సాదాకా కాకతీయుల సామ్రాజ్యం విస్తరించి ఉందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 350కి పైగా కాకతీయుల కట్టడాలు ఉన్నాయని, నైన్పాక దేవాలయానికి కూడా వారసత్వ సంపదలో స్థానం ఉండేలా చర్యలు తీసుకుంటామని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్, ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. -
నువ్వే మార్గదర్శకుడివి అన్నా..
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ ప్రత్యర్థులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డిల మధ్య ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలో సరదా సంభాషణ జరిగింది. ఉదయం సభా ప్రారంభానికి ముందు సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర, మాజీమంత్రి హరీశ్‌రావు పలకరించుకున్న సమయంలో అక్కడకు ఎర్రబెల్లి వచ్చారు. రాగానే ఆయన ఏం బుద్ధిమంతుడిలా ఉన్నావ్.. అని గండ్రనుద్దేశించి అన్నారు. ఇందుకు స్పందించిన గం డ్ర ‘నేనెప్పుడూ బుద్ధిమంతుడినే అన్నా.. అయినా అన్నీ నీ నుంచి నేర్చుకున్నవే కదా.. నువ్వే మార్గదర్శకుడివి అన్నా’అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. గుత్తాకు ఉత్తమ్ కంగ్రాట్స్.. సభ ముగిసిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో నల్లగొండ నేతలు ఉత్తమ్, గుత్తా సుఖేందర్‌రెడ్డిల మధ్య కూడా సరదా చర్చ జరిగింది. తనకు తారసపడిన ఉత్తమ్‌ను గుత్తా పలకరించగా కంగ్రాట్స్ గుత్తాగారూ అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కంగ్రాట్స్ ఎందుకు చెబుతున్నారో అర్థంకానట్లు గుత్తా సైలెంట్‌గా నవ్వి ఊరుకున్నారు. గుత్తా మంత్రి కాబోతున్నారని, అందుకే ఉత్తమ్ కంగ్రాట్స్ చెప్పినట్టున్నారని అక్కడున్న జర్నలిస్టులు చర్చించుకోవడం గమనార్హం. -
అవును.. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు ఆదివారం సమావేశమైన శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య కాస్తంత వాడీ వేడీ చర్చ జరిగింది. గండ్ర మాట్లాడుతున్నప్పుడు ‘మీ గవర్నర్’అని సంబోధించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని ‘మన గవర్నర్’అనాలని సూచించారు. టీఆర్ఎస్కు ఒక గవర్నర్, కాంగ్రెస్‌కు మరో గవర్నర్ ఉండరని వ్యాఖ్యానించారు. కాబట్టి గండ్ర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను ముఖ్యమంత్రి కోరారు. దీనికి కొనసాగింపుగా గండ్ర మాట్లాడుతూ.. అలాగైతే గవర్నర్ ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ‘టీఆర్ఎస్ ప్రభుత్వం’పోరాడుతుందని అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అని చదవకుండా, టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎలా అన్నారని ప్రశ్నించారు. దీన్ని కూడా రికార్డుల నుంచి తొలగించాలని గండ్ర డిమాండ్ చేశారు. వెంటనే సీఎం జోక్యం చేసుకొని గండ్రపై మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కాబట్టి గవర్నర్ అలాగే చదివారన్నారు. ప్రజలు టీఆర్ఎస్నే గెలిపిం చాక ఇందులో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఎందుకంత అసహనమని నిలదీశారు. టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారు కదా అని అన్నా రు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వమనే రాస్తాం. అలా రాయడమే కరెక్ట్’అని ముఖ్యమంత్రి ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీనిపై గండ్ర స్పందిస్తూ.. సీఎం వ్యాఖ్య లపై తాను వాదనకు దిగదల్చుకోలేదని, ఇక ఆ విషయంపై చర్చను కొనసాగించాలనుకోవడం లేదని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడారు. -
టీఆర్ఎస్ పాలనలో అంతులేని అవినీతి
సాక్షి, కోల్‌బెల్ట్: టీఆర్ఎస్ పార్టీ నాలుగున్నరేళ్ల పాలనలో అంతులేని అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–5 గనిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తిగా కొనసాగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జోక్యం మితిమీరిందన్నారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సింగరేణి అధికారులు వత్తాసు పలుకుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థికి గేట్ మీటింగ్‌కు అవకాశమిచ్చిన అధికారులు నేడు తాము వెళితే గేటు మూసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే సింగరేణి పరిశ్రమలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా కార్మికులకు సంబంధించిన సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి కృషి జరుగుతుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, స్పీకర్‌కు షికారు పిట్టలు కావాలని, అందుకే భూపాలపల్లి ఏరియాలో ఓ పిట్టను తయారు చేసి కార్మికుల రక్తాన్ని జలగల్లాగా పీల్చి పిప్పిచేస్తున్నారని ఆరోపించారు. కారుణ్య నియామకాల విషయంలో కార్మికుల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని, తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని చెప్పారు. ప్రణాళికలు లేనందున ఆశించిన మేరకు జిల్లా అభివృద్ధి జరగలేదని తాము సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. బస్‌డిపో, జూనియర్, డిగ్రీ, పీజీ సెంటర్, ఐటీఐ తదితర విద్యా కేంద్రాలకు అనుమతి తన హయాంలోనే వచ్చాయని స్పీకర్ కొత్తగా సాధించిందేమీ లేదని అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు అవుటర్ రింగ్‌రోడ్డు పనులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, నాలుగు ప్రదేశాల్లో శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు కాసర్ల రాంరెడ్డి, రత్నం సమ్మిరెడ్డి. జోగ బుచ్చయ్య, కె.నర్సింగరావు, రఘోత్తంరెడ్డి, అయిలుమల్లు, బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్ధన్, మండ సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఫిట్ కార్యదర్శి డి.తిరుపతి, టీజేఎస్ నాయకులు రాజలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే..
భూపాలపల్లి : రైతులు ఆరుగాలం శ్రమించినా వారిలో ఆనందం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పదవి చేపట్టిన వేళావిశేషంతో గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 40 రోజులపాటు చేపట్టనున్న ‘రైతు భరోసా’ పాదయాత్రను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మండలంలోని ఆజంనగర్‌లో సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు భూపాలపల్లి నుంచి బయల్దేరిన ఆయన పట్టణంలోని హనుమాన్ దేవాలయం, పంబాపూర్ శివాలయం, ఆజంనగర్‌లోని చెన్నకేశవ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆజంనగర్‌లో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గండ్ర మాట్లాడుతూ.. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకే ఉగాది మరునాడే కొత్త కోండ్రు ఆజంనగర్ నుంచి ప్రారంభించానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణాలను పావలా, ఆటానా మాఫీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయాలు రైతులకు దోహదంగా ఉండేయన్నారు. గిట్టుబాటు ధరకు మించి పంటలను కొనుగోలు చేసే వారన్నారు. గత ఏడాది రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ తాము వరంగల్ మార్కెట్ యార్డుకు వెళ్తే ప్రభుత్వం పోలీసులచే అరెస్ట్ చేయించిందన్నారు. పప్పు దినుసులు మేలని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అధికంగా పండించారని, ఇప్పుడు వాటిని కొనుగోలు చేసే వారే కరువయ్యారని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటారని ఆరోపించారు. భూరికార్డుల క్రమబద్ధీకరణతో వీఆర్వో నుంచి కలెక్టర్ల వరకు బాగుపడ్డారని, రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు చేపట్టిన తన పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని గండ్ర కోరారు. వైఎస్ హయాంలో ఒకేసారి రుణమాఫీ : మాజీ మంత్రి శ్రీధర్‌బాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేశారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. మాఫీకి ముందే రుణాలు చెల్లించిన రైతులకు సైతం రూ.5 వేలు అందించామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.4 వేలు అందించేందుకు వస్తుందన్నారు. అయితే బ్యాంకు రుణాలకు సంబంధించి రైతులు ఇప్పటి వరకు ఎంత వడ్డీ చెల్లించారో కాగితం తీసుకొని వచ్చి ప్రస్తుత ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు. టీఆర్ఎస్కు పుట్టగతులుండవు.. కాంగ్రెస్‌ను విమర్శిస్తే టీఆర్ఎస్కు పుట్టగతులుండవని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి అన్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసి ఈ పాదయాత్ర ప్రారంభించాడన్నారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై ఆజంనగర్, నాగారం, పంబాపూర్‌లో కొనసాగింది. పాదయాత్రకు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు దొమ్మాటి సాంబయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, కొత్త హరిబాబు, గడ్డం కుమార్‌రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, మందల విద్యాసాగర్‌రెడ్డి, గండ్ర హరీష్‌రెడ్డి, ఆకుల మల్లేష్, సెగ్గెం సిద్ధు, నూనె రాజు, గొర్రె సాగర్, పొలుసాని లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
బెదిరింపులతోనే టీఆర్ఎస్ గెలుపు: గండ్ర
సాక్షి, హైదరాబాద్: మద్యం, డబ్బు, ఫిరాయింపులు, కార్మిక నేతలను బెదిరించడం వంటి చర్యలతో టీఆర్ఎస్ సింగరేణి ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి కార్మికసంఘం ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదన్నారు. టీఆర్ ఎస్ అనుబంధ సంఘానికి ఓటేయాలంటూ సింగరేణి అధికారులు కార్మికులపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెండి గ్లాసులు పంచారని, ఓటుకు రూ. 10వేల చొప్పున పంపిణీ చేశారని ఆరోపించారు. అధికార టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన కార్మిక సంఘానికి కార్మికులు భారీగా ఓట్లేశారని గండ్ర చెప్పారు. -
ప్లీనరీని ఆత్మపరిశీలన వేదికగా చేసుకోవాలి
టీఆర్ఎస్ నేతలకు మాజీ చీఫ్ విప్ గండ్ర సూచన హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీని ఆత్మపరిశీలన వేదికగా చేసుకోవాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రజలకిచ్చిన హామీలేమిటి, అందులో ఎన్ని అమలయ్యాయో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్లీనరీలో నేతలతో కాకుండా సామాన్య కార్యక ర్తలతో మాట్లాడిస్తే వాస్తవ పరిస్థితులు వెల్లడవుతాయన్నారు. గ్రామాల్లో తీవ్ర కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల వంటి వాస్తవాలు తెలుస్తాయన్నారు.