భూపాలపల్లి: ‘నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశా.. పార్టీని వీడటం బాధగా ఉంది.. అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధాతప్త హృదయంతో తీసుకున్న నిర్ణయం ఇది’ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం భూపాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో తన సతీమణి జ్యోతితో కలసి కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గండ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రం, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై తనతో పాటు తన భార్య జ్యోతి నిత్యం బాధ పడ్డామని చెప్పారు. గడిచిన నలభై రోజులుగా రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అధికార పార్టీలో చేరాలా వద్దా అని ఆలోచించామని పేర్కొన్నారు.
చివరకు భూపాలపల్లిలో మెడికల్ కళాశాల, బైపాస్ రోడ్డు, లిఫ్ట్ ఇరిగేషన్, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనులను చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలు వేరైనా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తాను అన్నదమ్ముల్లా మెదిలామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆహ్వానం మేరకు.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పారు. పార్టీ మారుతున్న సందర్భంగా కార్యకర్తలకు సమాధానం ఇచ్చే క్రమంలో బాధ పడుతున్నానని గండ్ర గద్గద స్వరంతో మాట్లాడుతుండగా ఆయన సతీమణి జ్యోతి కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment