కేటీకే–5 గని గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న ‘గండ్ర’
సాక్షి, కోల్‌బెల్ట్: టీఆర్‌ఎస్ పార్టీ నాలుగున్నరేళ్ల పాలనలో అంతులేని అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–5 గనిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తిగా కొనసాగిందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జోక్యం మితిమీరిందన్నారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు సింగరేణి అధికారులు వత్తాసు పలుకుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ అభ్యర్థికి గేట్ మీటింగ్‌కు అవకాశమిచ్చిన అధికారులు నేడు తాము వెళితే గేటు మూసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే సింగరేణి పరిశ్రమలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా కార్మికులకు సంబంధించిన సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి కృషి జరుగుతుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్, స్పీకర్‌కు షికారు పిట్టలు కావాలని, అందుకే భూపాలపల్లి ఏరియాలో ఓ పిట్టను తయారు చేసి కార్మికుల రక్తాన్ని జలగల్లాగా పీల్చి పిప్పిచేస్తున్నారని ఆరోపించారు. కారుణ్య నియామకాల విషయంలో కార్మికుల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని, తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని చెప్పారు. ప్రణాళికలు లేనందున ఆశించిన మేరకు జిల్లా అభివృద్ధి జరగలేదని తాము సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. బస్‌డిపో, జూనియర్, డిగ్రీ, పీజీ సెంటర్, ఐటీఐ తదితర విద్యా కేంద్రాలకు అనుమతి తన హయాంలోనే వచ్చాయని స్పీకర్ కొత్తగా సాధించిందేమీ లేదని అన్నారు.
మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు అవుటర్ రింగ్‌రోడ్డు పనులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, నాలుగు ప్రదేశాల్లో శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్, ఐఎన్‌టీయూసీ నాయకులు కాసర్ల రాంరెడ్డి, రత్నం సమ్మిరెడ్డి. జోగ బుచ్చయ్య, కె.నర్సింగరావు, రఘోత్తంరెడ్డి, అయిలుమల్లు, బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్ధన్, మండ సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఫిట్ కార్యదర్శి డి.తిరుపతి, టీజేఎస్ నాయకులు రాజలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment