‘కేసీఆర్ నిద్ర పోవడం బంద్ చేస్తాడు’
సంగారెడ్డి : ప్రజా గర్జన సభ చూసి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఇక నిద్ర పట్టదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన గురువారం మాట్లాడారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంకు ఘన చరిత్ర ఉందన్నారు. 1979 డిసెంబర్‌లో ఇందిరా గాంధీ సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారని, ఆ తరువాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చారన్నారు.
ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని జగ్గారెడ్డి అన్నారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి ఈ ప్రజా గర్జన సభే నాంది అన్నారు. 40 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ మనవడు రాహుల్ మెదక్ గడ్డకు వచ్చారని, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి... కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోనియాగాంధీ భిక్షతోనే కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందన్నారు. కాంగ్రెస్‌పై దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. టీఆర్‌ఎస్ బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు. కొందరు పోలీసు అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే అధికారులు ఉండలేరని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పతనం ఖాయమని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.