టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో జానారెడ్డి భేటీ
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బుధవారం ఉదయం టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదో సీటుపై టీఆర్‌ఎస్ కన్నేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేత కేకే ఇంటికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి వెళ్లడం చర్చనీయాంశమయ్యింది. కాగా భేటీ అనంతరం కేకే మాట్లాడుతూ తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.
దాంతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది. క్యాండిడేట్ ఎవరనేది అధిష్టానం బుధవారం సాయంత్రానికి ప్రకటించనుంది. పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు కోసం 40 మంది నేతలు పోటీ పడుతున్నారు. టి కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం నెలల తరబడిగా పార్టీ హై కమాండ్‌తో లాబీయింగ్ చేసుకుంటున్నారు. అభ్యర్ధి ఎంపిక అధికారం సోనియాదైతే సీనియర్లకు... రాహుల్ సిఫారసే కీలకమైతే జూనియర్లకు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ రావచ్చనేది టి కాంగ్రెస్ నేతల అంచనా. క్యాండిడేట్ సెలక్షన్‌పై హై కమాండ్ నేతలు బుధవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడుతారని సమాచారం.