సాక్షి, వరంగల్ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంత.. ఆయనకు కనీస మానవత్వం కూడా లేదు’ అని పీపీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోందని, అయినప్పటికీ రజాకర్లను తలపించిన పోలీసులను తప్పించుకొని చలో ట్యాంక్ బండ్‌ను విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. హన్మకొండలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
లా అండ్ ఆర్డర్‌ను విస్మరించి పోలీసులు రాజకీయ పార్టీల నాయకుల ఇళ్ల ముందు కాపలా ఉన్నారన్నారు. కేసీఆర్ కు మానవతా దృక్పథం లేదని, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులపై నిర్దయతో వ్యవహరించారని, కొండగట్టు బస్ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తే వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తుల దక్కించుకోవడానికి ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడుగా ఉన్న హరీశ్‌రావును పథకం ప్రకారమే తప్పించారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. చలో ట్యాంక్ బండ్ విషయంలో 70 ఏళ్లలో భారతదేశంలో ఇంతటి దుర్దినం కనిపించలేదన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగించాలని, శనివారం ట్యాంక్‌బండ్ ఘటనపై సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment