
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సుమారు రూ. 5 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించిన సీఎం కేసీఆర్ దేశం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం గొప్పలు చెప్పుకొనేందుకే తాపత్రయపడ్డారని విమర్శించారు.
రాష్ట్రంలో 17 లక్షల మంది దళితులుంటే కేవలం 30 వేల మందికే దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ దేశమంతా దీన్ని వర్తింపజేస్తానని సీఎం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చి కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారని పొన్నాల ఆక్షేపించారు. మిషన్ భగీరథ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు తాగలేని దుస్థితి నెల కొందని, ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment