సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. పదవుల కోసం తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ ఇతర పార్టీల్లోకి దూకుతున్నారని, మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న ఘటనలను దేశ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని షోలాపూర్, నాగపూర్ తదితర ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో తెలంగాణలో సాధించిన అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
మనది రోటీ.. బేటీ అనుబంధం
‘‘వేయి కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్న తెలంగాణ, మహారాష్ట్ర నడుమ ‘రోటీ.. బేటీ’ సంబంధం ఉంది. రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత ఉంది. ఎంతో అనుబంధమున్న మహారాష్ట్ర నుంచే బీఆర్‌ఎస్ పార్టీని విస్తరిస్తున్నాం.
గడప ముందు నిలబడిన బీఆర్‌ఎస్‌ను ఆదరిస్తే తెలంగాణలో జరిగినట్టు మహారాష్ట్రలో ప్రగతి ఎందుకు సాధ్యం కాదో చూద్దాం. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్‌ఎస్‌ను మహారాష్ట్ర మీదుగా యూపీ, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు అవసర మైన ఏర్పాట్లు చేస్తాం’’ అని కేసీఆర్ అన్నారు.
త్వరలో సోలాపూర్‌లో భారీ బహిరంగ సభ
‘మరో మారు సోలాపూర్ పర్యటనకు రావడానికి వారం రోజుల ముందు మంత్రి హరీశ్‌రావును పంపిస్తా. ప్రజల భాగస్వామ్యంతో భారీ ర్యాలీ తీసి 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. తమకు తెలంగాణ కన్నతల్లి అయితే మహారాష్ట్ర పెంచిన తల్లిలాంటిదని బీఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలు అన్నారు. తెలంగాణ నుంచి తమ తాతలు, తండ్రులు వలస వెళ్లి స్థానిక ఆదరణతో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నామన్నారు.
కాగా పార్టీలో చేరిన నేతలు కేసీఆర్‌కు స్థానిక గ్రామ దేవత ప్రతిమను అందజేశారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో షోలాపూర్ కార్పొరేటర్లు నగేశ్ వల్యాల్, జుగన్‌బాయ్ అంబేవాలే, సంతోష్ భోంస్లే, మాజీ కార్పొరేటర్ రాజేశ్వరి చవాన్‌తో పాటు సోలాపూర్, నాగపూర్‌కు చెందిన పలువురు నేతలు ఉన్నారు.
చేరికల కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు సమన్వయం చేయగా, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెల్లపల్లి రవీందర్ రావు, మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు రవీందర్ సింగ్, సోమా భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment