సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించనుండటంతో దేశమంతా తెలంగాణవైపు చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కేడర్ అంతా సమష్టిగా నిలబడి ఈ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16, 17 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయిలో రేవంత్ మాట్లాడారు. 17న నిర్వహించే బహిరంగ సభలో సోనియాగాంధీ ఐదు గ్యారెంటీ కార్డు స్కీంలను ప్రకటిస్తారని, ఈ సభ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వబోతోందన్నారు.
బీఆర్‌ఎస్ వైఫల్యాలపై ప్రజల్లోకి జాతీయ నేతలు: ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను, గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేందుకు 119 మంది జాతీయ స్థాయి నేతలు అన్ని నియోజకవర్గాలకు వస్తారని రేవంత్ వివరించారు. అదేవిధంగా భారత్‌జోడో యాత్ర ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 7న భారత్‌జోడో యాత్ర సమ్మేళనాల పేరుతో మండల, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించి ఉత్సవాలు జరపాలని కోరారు.
కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ నేతలపై ప్రత్యేక నమ్మకం ఉందని, అందుకే జాతీయ స్థాయిలో మూడు పదవులు ఇచ్చారని, ఇందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్నానని రేవంత్ తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఈ భేటీలో సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ, ముఖ్య నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, మధుయాష్కీ గౌడ్, షబ్బీ ర్ అలీ, జగ్గారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment