సీట్ల కోసం కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో సీట్ల కోసం నేతలు పంచాయితీకి దిగారు. ముందు వరుసలో సీటెందుకు కేటాయించలేదని ఒకరు, తనను వేదికపైకి ఆహ్వానించలేదని మరొకరు వాగ్వాదానికి దిగారు. నిరసన వ్యక్తం చేశారు. ఆరంభంలోనే రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తన సీటు కోసం దిగ్విజయ్‌సింగ్, పొన్నాల లక్ష్మయ్యతో గొడవకు దిగారు. వేదికపైకి ఆహ్వానించడంతో వెళ్లిన వీహెచ్‌ను రెండో వరుసలో కూర్చోవాలని అక్కడున్న కొందరు నేతలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ముందు వరుసలో సీటెందుకు కేటాయించ లేదని పొన్నాలతో వాదించారు. ‘గొడవ చేయొద్దు. ఎక్కడో ఒకచోట కూర్చోండి. ప్రతిదానికి గొడవెందుకు?’ అని దిగ్విజయ్ వారించారు. అయినప్పటికీ దిగ్విజయ్‌తోనూ వీహెచ్ వాగ్వాదానికి దిగారు. సీనియర్లకు విలువ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తంచేశారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తనకు కనీసం ఆహ్వానమైనా పంపలేదని మండిపడ్డారు. టీపీసీసీ తీరుపై వేదిక కింద కూర్చొని ఆమె నిరసన తెలిపారు. పొన్నాల రేణుక వద్దకొచ్చి సమాచార లోపం వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చారు.
ఏర్పాట్లు ఘోరం...!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఏర్పాట్లలో జిల్లా పార్టీ ఘోరంగా విఫలమైంది. కార్యకర్తలకు కనీసం తాగునీరు సరఫరా చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాయకులకు, కార్యకర్తలకు నిర్వాహకులకు భోజన, వసతి ఏర్పాట్లు చేయలేదు. వందలాది మంది కార్యకర్తలకు భోజనం అందలేదు. సమీప పరిసరాల్లో ఎక్కడా హోటళ్లు కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించారు. వీరిలో కొందరు షుగర్ రోగులుండడంతో నిర్వాహకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రముఖులకూ భోజనం అందలేదు. మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, బలరాం నాయక్‌సహా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం భోజనం దొరకక ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలకు వసతి లేదు. దీంతో వందలాది మంది కార్యకర్తలు చేసేదేమీ లేక పార్టీ నేతలను తిట్టుకుంటూ తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.