చేతులు కాలాక.. | congress leaders join in BJP | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక..

Published Wed, Dec 31 2014 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

చేతులు కాలాక.. - Sakshi

చేతులు కాలాక..

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ :చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది కాంగ్రెస్  వ్యవహారశైలి. జిల్లాలో పార్టీ నుంచి పెద్దఎత్తున వలసలుంటాయని, సాక్షాత్తూ జెడ్పీచైర్మనే పార్టీని వీడుతున్నారని కొద్ది నెలల నుంచి ప్రచారం జరుగుతున్నా,  చూస్తూ ఊరుకుండిపోయిన ఆ పార్టీ నేతలు.. ఆ ప్రచారం నిజమై వలసలు జరిగిన రోజున మేల్కొని సమావేశం ఏర్పా టు చేసుకున్నారు. మిగిలిన కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి ఉండాలనే సందేశాన్ని పంపడంతో పాటు పార్టీ నేతలకు భరోసా ఇచ్చేం దుకుగాను హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పార్టీ నేతలంతా హాజరయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, చిరుమర్తిలింగయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, దాదాపు 30 మందికిపైగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా తాజా వలసలపై చర్చ జరిగింది.
 
 ముఖ్యంగా బాలునాయక్‌కు కాం గ్రెస్ పార్టీ చేసిన మేలు మరిచి ఆయన పార్టీ వీడి వెళ్లడం బాధాకరమని సమావేశంలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ‘ఆరోజున మీరే బాలునాయక్‌ను చైర్మన్‌గా ఎంపిక చేశారు. కనీసం గెలిచిన జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరిని జెడ్పీచైర్మన్ చేద్దామన్న సంప్రదింపులు కూడా చేయకుండా నలుగురు నాయకులు కూర్చొని బాలూనాయక్‌ను చైర్మన్ చేయాలని చెప్పారు. ఇప్పుడేం జరిగింది. ఆరోజే ఆ పని చేయకుండా మా నెత్తిన కూర్చోపెట్టకుండా ఉండాల్సింది.’ అని సమావేశానికి హాజరైన పలువురు జెడ్పీటీసీలు ముఖ్య నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి స్పందిం చిన నేతలు అప్పుడు బాలునాయక్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకు చైర్మన్ పదవి ఇచ్చామని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న దేవరకొండను పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చిన కారణంగా సర్దుబాటు చేయాల్సి వచ్చిందని నేతలు వివరణ ఇచ్చినట్టు సమాచారం.
 
 అయితే, ఈ సమావేశాన్ని ఇప్పుడెందుకు ఏర్పాటు చేశారని, బాలునాయక్ టీఆర్‌ఎస్‌లోనికి వెళుతున్నారని ప్రచారం జరుగుతున్నప్పుడే ఆయన సమక్షంలోనే సమావేశం ఏర్పాటు చేస్తే తామే ఆయన్ను ప్రశ్నించేవారం కదా అని కొందరు జెడ్పీటీసీలు అడిగినట్టు సమాచారం. సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్న అంశాన్ని మర్చిపోయి పార్టీ నుంచి నేతలను చేర్చుకుంటున్నారని, ఇంతటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని అన్నట్టు సమాచారం. ఎంపీ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తన వల్లే పార్టీని వీడి బాలునాయక్ వెళ్లాడనడంలో వాస్తవం లేదని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ అభివృద్ధి కోసమే తాను పాటుపడ్డాడని, దేవరకొండను కాంగ్రెస్ కంచుకోటగా మల్చడంలో తన కృషి కూడా ఉందని ఆయన చెప్పారు. మొత్తంమీద పార్టీలో ఉన్న వారయినా కలిసిమెలిసి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని ముఖ్య నాయకులు సూచించారు.
 
 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ‘చే’జారనీయొద్దు
 రానున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై కూడా చర్చ జరిగింది. పార్టీకి చెందిన కిందిస్థాయి ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈస్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా పార్టీ నేతలు నిర్ణయించారు. దీనిపై చర్చ సందర్భంగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పార్టీ నేతలు సుంకరి మల్లేశ్‌గౌడ్, గూడూరు నారాయణరెడ్డిలు తాము పోటీచేసేందుకు సుముఖంగా ఉన్నామని చెప్పినట్టు సమాచారం.
 
 దేవరకొండ ప్రత్యేక సమావేశం
 జిల్లా సమావేశానంతరం దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం కూడా కొత్తపేటలో జరిగింది.  ఈ సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి దేవరకొండ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఆయన దేవరకొండకు ఎక్కువ సమయం కేటాయించాలని, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకు అండగా ఉండాలని కూడా స్థానిక నేతలు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement