
కేసీఆర్ భాష అభ్యంతరకరం: జానారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం తెలంగాణ సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ప్రభుత్వ వ్యవహారం అరాచకంగా ఉంది. కేసీఆర్ మాటలు టీఆర్‌ఎస్‌కే వర్తిస్తాయి. ఆయన వ్యాఖ్యలను చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీగా చాలా సంయమనంగా ఉన్నాం. సీఎం పదజాలాన్ని తీవ్రస్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా పాలన చేస్తానంటే ఎలా?. తప్పు కాంగ్రెస్‌పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మాపై నిందలు వేస్తున్నారు.
ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టులకు వెళ్లేవారితో కాంగ్రెస్‌కు సంబంధం లేదు. కడుపు మండినవాళ్లే కోర్టుకు వెళుతున్నారు. గతంలో జాగృతిలో పనిచేసినవారే కోర్టులో కేసు వేశారు. అసంబద్ధ నిర్ణయాలు కోర్టులో నిలబడటం లేదు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ సహకరిస్తుంది. సింగరేణి కారుణ్య నియామకాలపై అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం.’ అని గుర్తు చేశారు.
కాగా అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ కేసుల పురాణం మొదలు పెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజల పాలిట కాంగ్రెస్ పిశాచిలా, భూతంలా తయారైందని నిప్పులు చెరిగారు. కొత్త రాష్ట్రాన్ని గొంతు నులిమేసేందుకు విషపూరిత వైఖరిని అవలంబిస్తోందని, తెలంగాణకు అప్పుడూ ఇప్పుడూ విలన్ నంబర్ వన్ కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. కేసుల రూపంలో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ఆ పార్టీ శిఖండి పాత్ర పోషిస్తోందని అన్నారు.