
ఏడు మండలాలను వదులుకున్న కేసీఆర్
హైదరాబాద్: పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు మండలాలను తెలంగాణ ముఖ్యమంత్రి వదులుకున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత టి. జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న వాటర్ గ్రిడ్ పథకంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదని విమర్శించారు. ఆ పథకం వల్ల రూ.2 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కానుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వేల కోట్లతోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేయొచ్చని ప్రభుత్వానికి సూచించారు.
అందుకు అదనంగా మరో రూ.38 కోట్లు ఎందుకు వినియోగిస్తున్నారో సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వృథా అయ్యే నిధులతో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టవచ్చని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కానీ, ప్రస్తుతం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు దారుణమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర నుంచి 1800 ఎకరాలు సాధించలేరా ? అని ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. ముంపునకు గురయ్యే 1800 ఎకరాలను మహారాష్ట్ర ఇచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ సర్కారును డిమాండ్ చేశారు.