- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న
- జర్నలిస్టులకు అండగా నిలుస్తానని హామీ
టేకులపల్లి : ఎన్నికల్లో గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని, ముఖ్యమంత్రి అయ్యూక ప్రజా సంక్షేమమే మరిచిపోయూరని ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పటభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విమర్శించారు. తన కుటుంబ సభ్యుల సౌఖ్యమే చూసుకుంటున్నారని అన్నారు.
శనివారం రాత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూక్య దళ్‌సింగ్ నాయక్ ఆధ్వర్యంలో గుండా నరసింహారావు నివాసంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనపై పోటీకి వస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజులను మాయం చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేస్తే పట్టభద్రుల భవిష్యత్తు ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. చట్టసభలో సామాన్యులు, ఉద్యమ చరిత్ర కలిగిన వారు ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు.
బలమైన ప్రతిపక్షం లేకపోవడంవల్లే రాష్ట్రంలో కేసీఆర్ ఆగడాలు సాగుతున్నాయని అన్నారు. మండలిలో ప్రజాసంక్షేమంపై పాలకపక్షాన్ని నిలదీసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అర్హతలు ఉన్నా పోలీసులు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇస్లావత్ పార్వతి, ఎంపీటీసీలు గుగులోత్ సత్యవతి, జబ్బ విజయలక్ష్మీ, నాయకులు శేషురాంనాయక్, రెడ్యానాయ్, మున్నుస్వామి, సక్రు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం గారూ... ఇంటికో ఉద్యోగమేది...?
Published Sun, Mar 15 2015 1:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement