సాక్షి,మహబూబ్‌నగర్ : ఒకనాడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను శాసించిన కాంగ్రెస్ పార్టీ నేడు సరైన నేతల్లేక వెలవెలబోతోంది. నమ్ముకున్న నాయకులు పార్టీలు మారడంతో శ్రేణులు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో సగానికి పైగా సెగ్మెంట్లలో పార్టీ ఇన్‌చార్జ్‌లు లేకుండానే పార్లమెంటు ఎన్నికలకు పోవాల్సిన విపత్కర పరిస్థితులు దాపురించాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహం ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరి పార్టీ అభ్యర్థిగా, కల్వకుర్తి ఇన్‌చార్జ్ డాక్టర్ వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానానికి పోటీ పడుతున్నారు.
జడ్చర్ల ఇన్‌చార్జ్ డాక్టర్ మల్లు రవి నాగర్‌కర్నూల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థులుగా తలపడుతున్నారు. అయితే గద్వాల కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా ఉండటమేగాక పార్టీ శ్రేణులను సొంత బలగంగా డీకే అరుణ సిద్ధం చేసుకుంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి క్యాడర్ ఆమె వెంటే నడుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె సొంత బావ, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డిని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. కొడంగల్, జడ్చర్ల, కల్వకుర్తిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎంపీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని డీసీసీ వర్గాల సమాచారం.
మూడు చోట్ల దిక్కెవరో...!
ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్ ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కారెక్కగా, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు సుమారు నాలుగున్నర ఏళ్లుగా ఖాళీగా ఉన్న మక్తల్ సెగ్మెంట్‌కు పార్టీ బాధ్యులు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగానే చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను డీకే అరుణ తీసుకోవడంతో అప్పట్లో ఇన్‌చార్జ్ నియామకం సమస్య తాత్కాలికంగా సమసిపోయింది.
కాని ఆమెతోపాటు కొల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీ తరఫున ఎవరిని నియమిస్తారోనన్న చర్చ కొనసాగుతోంది. కాగా, డీకే అరుణ అనుయాయుడు, దేవరకద్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, అచ్చంపేట ఇన్‌చార్జ్, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడైన డాక్టర్ వంశీకృష్ణ పార్టీని వీడనున్నారని ప్రచారం జరగడం కాంగ్రెస్‌ను మరింత కలవరపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment