ఏ పార్టీతోనూ పొత్తులుండవు
గ్రేటర్ ఎన్నికల్లో స్థానికేతరులకు అవకాశమివ్వం
సమర్థవంతమైన నాయకులను ఎంపికచేస్తాం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
హైదరాబాద్: వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. లోగడ ఎంఐఎంతో అంతర్గత పొత్తులు ఉండేవని, ఈసారి జరిగే ఎన్నికల్లో అంతర్గత, బహిర్గత పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పారు. అత్యధిక డివిజన్లతోపాటు మేయర్ సీటును సైతం కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జామైఉస్మానియా ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, వి. హన్మంతరావు తదితర పీసీసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఏడాది పాలన పూర్తయినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాలేదని, ఉద్యోగాల నియామకాలు చేపట్టలేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అమరవీరుల కుటుంబాలు సైతం ఆందోళన చెందుతున్నాయని చెప్పారు.
పార్టీ మనుగడ కోసం పనిచేసే ప్రజాబలం కలిగిన స్థానికులైన నాయకులకు మాత్రమే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లను కేటాయిస్తామని చెప్పారు. మేయర్ సహా అన్ని డివిజన్లను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు విభేదాలు విడనాడి ఒక్కతాటిమీదకు రావాలని సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అవినీతి ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు తాను చేసిన తప్పిదం మీద వివరణ ఇవ్వకుండా నగరంలో గవర్నర్ పాలన, యూనియన్ టెరిటరీ వంటి అంశాలను ప్రస్తావించడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత హన్మంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఫారుఖ్‌అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, పీసీసీ నాయకులు బండ చంద్రారెడ్డి, నాగులూరి కృష్ణకుమార్‌గౌడ్ తదితరులు ప్రసంగించారు.
వీహెచ్‌పై దాడికి యత్నం
పార్టీ సమావేశంలో వీహెచ్‌పై యువజన కాంగ్రెస్ నేతలుగా చెప్పుకుంటున్న కొందరు దాడికి యత్నించిన తీరు కలకలం సృష్టించింది. సీనియర్ నాయకుడిపై దాడి చేసేందుకు నలుగురు యువకులు వేదికపైకి ఎక్కడం.. స్వయాన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వారిని వారించి కిందకు తోసేయడంతో పరిస్థితి చేయిదాటి పోలేదు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ తనయుడు అనిల్‌ను మాట్లాడించేందుకు లష్కర్ కాంగ్రెస్ నాయకుడు ఆదం సంతోష్‌కుమార్ ప్రయత్నించారు. ఇందుకు వేదికపై ఉన్న వీహెచ్ అభ్యంతరం చెప్పారు. దీంతో ఆదం అనుచరులు కొందరు వీహెచ్‌పై దాడి చేసేందుకు వేదికపైకి దూసుకువెళ్లడం సమావేశంలో గందరగోళానికి దారితీసింది. వెంటనే అప్రమత్తమైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారిని ఉన్నఫలంగా కిందకు నెట్టివేయడంతో పరిస్థితి చేయిదాటిపోలేదు.