♦ కాంగ్రెస్‌పై అధికార పార్టీ ధ్వజం
♦ పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం
మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామనే పేరుతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా జిల్లా కేంద్రంతోపాటు నిజాంసాగర్‌లో ఆ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బాన్సువాడలో ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదంటూ టీఆర్‌ఎస్ నేతలు, రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మేయర్ సుజాత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిజామాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని టీఆర్‌ఎస్ నాయకులు తప్పుపట్టారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామనే పేరుతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా జిల్లాలో పలుచోట్ల ఆందోళనలకు దిగారు.
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శుక్రవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తుంటే, కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు తట్టుకోలేక అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తోందన్నారు. కానీ విపక్షాల నేతలు నిర్వాసితులకు అండగా ఉంటామనే పేరుతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జి ల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీ ఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఏఎస్ పోశెట్టి, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం
నిజాంసాగర్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అ డ్డుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని శుక్రవారం మం డల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేశారు. కాళేశ్వరం పథకాన్ని అడ్డుకోవాలని రైతులను కాంగ్రెస్ రెచ్చగొడుతోందంటూ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ నీటి సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతుల అవసరాల కోసం ప్రభుత్వం మెదక్ జిల్లాలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తుందన్నారు.
ముంపు గ్రామాలతో పాటు 6 వేల ఎకరాల భూములు నష్టపోతున్న రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ నిర్వాసితులను రెచ్చగొడుతూ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్‌హుస్సేన్, బంజపల్లి సర్పంచ్ బేగరి రాజు, టీఆర్‌ఎస్ రైతు నాయకులు పోచాగౌడ్, లింగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.