హైదరాబాద్:పోలవరం ఆర్డినెన్స్ ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆచారి స్పష్టం చేశారు. ఆ సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోలేక పోయిందని తెలిపారు. అప్పుడు లోక్ సభలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఆ ఆర్డినెన్స్ ను ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆచారి మండిపడ్డారు.
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం తగదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.