సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ముందస్తు వ్యూహంతో వెళుతోంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్‌పర్సన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తోంది. దీనిలో భాగంగా ఆరుగురు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఖరారు చేశారు. ఆదిలాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల అభ్యర్థులను బుధవారం అధి కారికంగా ప్రకటించారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థుల పేర్లలోనూ ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు మిగిలిన జిల్లాల చైర్మన్ అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. చైర్మన్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆయా మండలాలు, జిల్లాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ధీమా లభిస్తుందని, పార్టీ శ్రేణులకు కూడా స్పష్టత వస్తుందని, తద్వారా ఎన్నికలను దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ కేడర్‌లో విశ్వాసం కల్పించిన దిశలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించామని, తమకు అభ్య ర్థులు లేరనే అధికార పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా, మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ మేరకు ఎంపీపీ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాలను డీసీసీలకు కట్టబెట్టింది.
టీపీసీసీ ఖరారు చేసిన జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు..
- ఆదిలాబాద్: చారులత రాథోడ్
- మహబూబాబాద్: ఇస్లావత్ పార్వతి
- మహబూబ్‌నగర్: జె.దుష్యంత్‌రెడ్డి
- మంచిర్యాల: మద్ది రమాదేవి
- నల్లగొండ: కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి
- నాగర్‌కర్నూలు: అనూరాధ వంశీకృష్ణ
ఏకాభిప్రాయం వచ్చిన అభ్యర్థులు..
- సూర్యాపేట: పటేల్ లావణ్య
- యాదాద్రి భువనగిరి: కుడుదుల నగేశ్
Comments
Please login to add a commentAdd a comment