ఉపేందర్‌రెడ్డి
సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని, మెజార్టీయే తేలాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తన గెలుపునకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. మెదక్ నియోజకవర్గంలోని 261 గ్రామాల్లో నిశ్శబ్ధ విప్లవం కనిపిస్తోందని, కాంగ్రెస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్ దక్కడం తనకు వరంలాంటిదని, ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలి పారు. ఎన్నికల నేపథ్యంలో ఉపేందర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి: అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న మీరు పార్టీ నేతల మద్దతు ఎలా కూడగట్టారు?
ఉపేందర్‌రెడ్డి: కాంగ్రెస్ టికెట్ నాకు ప్రకటించినప్పటి నుంచి పార్టీలోని ఎమ్మెల్యే ఆశావహులందరినీ కలిసి వారి మద్దతు కూడగట్టాను. నా గెలుపుకోసం వారంతా చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. నా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నా గెలుపు కోసం కష్టపడుతున్నారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సహకరిస్తున్నారు.
సాక్షి: మీకే ఎందుకు ఓటు వెయ్యాలి?
ఉపేందర్‌రెడ్డి: కాంగ్రెస్ పార్టీ పట్ల మెదక్ నియోజకవర్గ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని గామాల్లో ప్రచారం చేశా. ఓటర్లను డైరెక్ట్‌గా కలిసి వారి మద్దతు కోరా. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. టీఆర్‌ఎస్ పాలనలో మెదక్ అన్ని రంగాల్లో వెనుకబడింది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు మెరుగ్గా అమలు కావాలన్నా ప్రజలు నాకు ఓటు వేయాలని కోరుతున్నా.
సాక్షి: మీకు పోటీ ఎవరనుకుంటున్నారు?
ఉపేందర్‌రెడ్డి: టీఆర్‌ఎస్ పార్టీయే మాకు ప్రత్యర్థి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మధ్య పోటీ ఉంటుంది. పోటీలో కాంగ్రెస్ గెలవడం ఖాయం.
సాక్షి: కాంగ్రెస్ గెలుస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు?
ఉపేందర్‌రెడ్డి: టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, సాగునీరు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదు. దీంతో టీఆర్‌ఎస్ పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత నా విజయానికి దోహదం చేస్తుంది. 40 వేల మెజార్టీతో నేను గెలవడం ఖాయం.
సాక్షి: కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇస్తోంది?
ఉపేందర్‌రెడ్డి: కాంగ్రెస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల పంట రుణమాఫీతోపాటు సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోంది. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయబోతోంది. రూ.50 వేల డ్వాక్రా రుణాల మాఫీతోపాటు లక్ష రూపాయల గ్రాంటు ఇవ్వనున్నాం. ఇంటి స్థలం ఉంటే ఒక్కో లబ్ధిదారుడికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నాం.
సాక్షి: నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలను గుర్తించారు?
ఉపేందర్‌రెడ్డి: మెదక్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా సాగు, తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఘనపురం ప్రాజెక్టు ఉన్నా రైతులకు సాగునీరు అందడం లేదు. ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ చేతులు ఎత్తేసింది. ఉపాధి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
సాక్షి: ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజలకు ఏం చేస్తారు?
ఉపేందర్‌రెడ్డి: నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తా. సింగూరు జలాలు కేవలం మెదక్ నియోజకవర్గం రైతులకు దక్కేలా చూస్తా. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ తెరిపించి చెరుకు రైతులు, కార్మికులకు న్యాయం చేస్తా. రామాయంపేటను డివిజన్ కేంద్రంగా మారుస్తా. ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతా, నిమ్జ్‌లాంటి పరిశ్రమ తీసుకువచ్చేందుకు కృషి చేస్తా.
Comments
Please login to add a commentAdd a comment