అమరుడవయ్యా కిష్టయ్యా
పంటచేలో పాలకంకి నవ్వినట్టుండే కిష్టయ్యా.. నీ మోము ఇంకా మాకు యాదే నీ ఆత్మబలిదానానికి అపుడే ఐదేళ్లు నిండాయా అమరుడా.. నీ కల నెరవేరింది... నువ్వు లేకపోతివి నీ అడుగుజాగలున్నయి.. నీ ఆశయాలున్నయి అవి చాలు మాకు...
కామారెడ్డి: 2009 నవంబరు తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర సాధ న కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్న సందర్భంలో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. మరుసటి రోజే అంటే 2009 నవంబర్ 30న రాత్రి పూట కామారెడ్డి పట్టణం నడుబొడ్డున కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. భిక్కనూరు మండలం శివాయిపల్లికి చెందిన కిష్టయ్య కామారెడ్డిలో విధులు నిర్వహించేవాడు. తెలంగాణ అంటే పడిచచ్చేవాడు.
తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు మారుతాయని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసుకుని మరీ బలిపీఠమెక్కాడు. ఆయన ఆత్మబలిదానంతో ఉద్యమం ఉధృతమైంది. పాలకుల వెన్నులో చలి పుట్టింది. కామారెడ్డి ప్రాంతంలో ఎన్నో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్‌రోకో వంటి ఆందోళనలు అగ్రభాగాన నిలిచాయి.
కిష్టయ్య విగ్రహం ఏర్పాటు
తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్యను స్మరించుకుంటూ ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో ఏ కార్యక్రమం జరిగినా కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేయడం ఆనవాయితీగా మా రింది. కిష్టయ్య తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ స్మరించుకుంటున్నారు. కిష్టయ్య ఆత్మబలిదానానికి ఆదివారంతో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణవాదులు ఆయనను స్మరించుకోనున్నారు. కిష్టయ్యకు భార్యా, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం వారు చదువుకుంటున్నారు. పద్మకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.