నల్లగొండ : నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఏసీడీపీ) ఖర్చు చేయడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏడాది పాలన పూర్తయినా ఇప్పటివరకు కనీసం సగం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల్లో నిధుల్లేక అభివృద్ధి పనులు ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంటే... కోట్లాది రూపాయల నిధులు ఉండి కూడా ప్రజా అవసరాలకు వినియోగించుకోకపోవడం విచారకరం. అధికార, ప్రతిపక్ష పార్టీ అనే వ్యత్యాసం లేకుండా తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల నిధుల్లో పైసా ఖర్చు చేయకుండా పదిలంగానే ఉంచారు. సాధారణంగా ఈ నిధులతో చేపట్టాల్సిన పనులను తమ అనుచరులు, దిగువ శ్రేణి నాయకులకు అప్పగిస్తుంటారు. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ నియోజకవర్గ నిధులు మంజూరైనా పనుల ప్రతిపాదనలు పంపడంలోనూ ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపడం లేదు.
వచ్చిన నిధులు రూ.18 కోట్లు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద (ఏసీడీపీ) నిధులు మంజూరయ్యాయి. ఈ పథకం కింద ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గానికి రూ.1.50 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో ఇదే పథకం కింద నియోజకవర్గానికి కోటి రూపాయాలు మాత్రమే కేటాయించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రజాప్రతినిధుల కోరిక మేరకు నియోజకవర్గానికి అదనంగా రూ.50 లక్షలు పెంచారు. ఈ లెక్కన జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.18 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఎమ్మెల్యేలు రూ.9 కోట్లు, మంత్రి ఆమోదంతో రూ.9 కోట్లకు పనుల ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం యథావిధిగా లభిస్తుంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ ఎమ్మెల్యేలు మాత్రం తప్పనిసరిగా మంత్రి ఆమోదం పొందాల్సిందే.
మంత్రి కోటా జోలికి వెళ్లని ఎమ్మెల్యేలు..
పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.18 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో కేవలం రూ.8.58 కోట్లు మాత్రమే పనుల ప్రతిపాదనలు పంపారు. నిధుల వినియోగానికి సంబంధించి ముందు వరుసలో ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి రూ.1.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపారు. నకిరేకల్, మునుగోడు, నల్లగొండ, కోదాడ, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి కోటా నిధుల జోలికి వెళ్లలేదు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే కోటా నిధులకు మాత్రమే ప్రతిపాదనలు పంపారు. మిగిలిన రూ.75 లక్షలు ముట్టుకోలేదు. ఇక దేవరకొండ ఎమ్మెల్యే నిధులు రూ.1.50 కోట్లలో పైసా ఖర్చు పెట్టకపోవడంతో మూలుగుతున్నాయి.
ఎమ్మెల్సీ నిధులు వినియోగం ఇలా....
ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్ నిధుల్లో మంత్రి కోటాతో కలిపి జిల్లాకు రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో 175 పనులకు ఆమోద ముద్రపడింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.3.80 కోట్లు. దీంట్లో ఇప్పటివరకు కేవలం 66 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఖర్చు పెట్టింది రూ.1.24 కోట్లు మాత్రమే. ఇంకా 109 పనులు మొదలుపెట్టలేదు. ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎమ్మెల్సీలు నిధుల వినియోగంలో ముందంజలో ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించడంలో చూపుతున్న నిర్లక్ష్యంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించి అభివృద్ధి పనులు చేపడితే ఎంతో మేలు జరుగుతుందని వారంటున్నారు. ఇప్పటికైనా స్పందించి నిధుల వినియోగంపై దృష్టిపెట్టాలని వారు కోరుతున్నారు.
ప్రజాప్రతినిధి పదిలం
Published Sun, Sep 6 2015 11:24 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement
Advertisement