ఇసుకకు ఇక్కట్లే! | Construction Delay For Lack Of Sand In Telangana | Sakshi
Sakshi News home page

ఇసుకకు ఇక్కట్లే!

Published Sun, Feb 23 2020 3:22 AM | Last Updated on Sun, Feb 23 2020 3:22 AM

Construction Delay For Lack Of Sand In Telangana - Sakshi

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగాలంటూ ప్రభుత్వ ఆదేశాలు ఒకవైపు... ఇసుక లభ్యత తగ్గుదల మరోవైపు.. వెరసి అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక లభ్యత తగ్గుతుండటంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండటంతో ఇసుక లభ్యత కష్టంగా మారింది. ప్రాజెక్టుల ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గితేగానీ ఇసుక తీయడం సాధ్యమయ్యేలా లేదు.  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగించేందుకు ఇసుక ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన మేర.. ఇసుక లభ్యత లేకపోవడం పెను ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇసుక లభ్యత అధికంగా ఉండే గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యత అధికంగా ఉండటంతో కొరత తీవ్రమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగంగా కొనసాగించాల్సిన సమయంలో లభ్యత తగ్గుతుండటం శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రాజెక్టులేమో నిండు కుండలా..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఇదివరకే నిర్ణయించింది. సాగునీటి శాఖ చేపట్టిన బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ప్రధానంగా ప్రాజెక్టులు చేపడుతున్న పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ వద్ద 4.18 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక లభ్యత ఉంటుందని గుర్తించి, అక్కడి నుంచే ప్రాజెక్టుల అవసరాలకు వాడుకున్నారు. అన్నారం బ్యారేజ్‌ వద్ద మరో 1.26 కోట్ల క్యూబిక్‌ మీటర్లు, సుందిళ్ల వద్ద సైతం అదే స్థాయిలో ఇసుక లభ్యత ఉంటుం దని గుర్తించి ఇందులో కొంతమేర వినియోగం చేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్యారేజీలన్నీ నిండుకుండలుగా ఉన్నాయి. మేడిగడ్డలో 16.12 టీఎంసీలకు ప్రస్తుతం 14 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అన్నారంలోనూ 10.87 టీఎంసీలకు గాను 6 టీఎంసీల మేర లభ్యత ఉంది. దీంతో ఇక్కడి నుంచి ఇసుక తీయడం సాధ్యం కాదు. సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి మిడ్‌మానేరు రిజర్వాయర్‌ పరిధిలోనూ నీటి నిల్వలు నిండుగా ఉన్నాయి. 25.87 టీఎంసీలకు గాను, 24 టీఎంసీల మేర నిల్వలు ఉండటం, ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండటం, దిగువకు వదులుతుండటంతో పరీవాహకంలోనూ పూర్తిగా ఇసుక లభ్యత తగ్గింది.

అవసరాలేమో ఆకాశంలో..
సమయంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇసుకఅవసరాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రధాన ప్రాజెక్టులకు మొత్తంగా 3కోట్ల క్యూబిక్‌ మీటర్ల అవసరం ఉండగా, ఇప్పటివరకు 1.50కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక వినియోగం జరగ్గా, మరో 1.50కోట్ల ఇసుక అవసరాలున్నాయని ఖనిజాభివృధ్ధి సంస్థకు నివేదిక అందింది. ఇందులో ఒక్క కాళేశ్వరం పరిధిలోనే 75 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని తేల్చారు. ఇందులో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి 40 లక్షల క్యూబిక్‌ మీటర్లు అవసరం కాగా ఇందులో 18 లక్షలు వినియోగం చేయగా, 22 లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇంకా వినియోగించాల్సి ఉంది.  వీటితో ఆదిలాబాద్‌ జిల్లాలోని కుఫ్టి, పెనుగంగ, చనాకా–కొరట, సదర్‌మఠ్‌ సహా ఇతర పనులకు 18 లక్షల క్యూబిక్‌ మీటర్లు, సీతారామ ఎత్తిపోతలకు 3.5 లక్షలు, దేవాదుల పరిధిలో 5.75 లక్షలు, పాలమూరులోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో మరో 3 లక్షలు, నల్లగొండ జిల్లాలోని డిండి, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులకు 26 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర అవసరాలను ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఈ సీజన్‌లోనే జూన్‌ వర్షాలు కురిసే నాటికి 50 నుంచి 75 లక్షల క్యూబిక్‌ మీటర్లు అవసరం కానుంది. ఈ స్థాయిలో ప్రస్తుతం ఇసుక లభ్యత లేదు. తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల ప్రాంతాల్లోనే కొద్దిమేర లభ్యత ఉండగా, దాన్ని స్థానిక కాల్వలు, బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణాలకు వాడుతున్నారు. 

ఖాళీ అయితే లభ్యత ఓకే..
ఏప్రిల్‌ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కాస్త ఉపశమనం కల్గించేలా ఉంది. ఏప్రిల్‌ నుంచి బ్యారేజీలు ఖాళీ అయితే మూడు నెలల పాటు ఇసుక తీసుకునే అవకాశం దొరుకుతుంది. కనిష్టంగా కోటి క్యూబిక్‌ మీటర్ల మేర తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక తుపాకులగూడెం, దమ్ముగూడెం ఎగువన గోదావరి ప్రవాహాలు తగ్గడంతో ఇసుక లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇసుకతోనే గట్టెక్కాలని సాగునీటి శాఖ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement