- ప్రాజెక్టులవారీగా ఇసుక అవసరాలను అంచనా వేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు నిర్మించిన ఏ ప్రాజెక్టు పరిధిలోనూ లేనంతగా 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అవసరం ఉంటుందని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. ఇక డిండి ప్రాజెక్టుకు 27 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని తేల్చింది. అన్ని ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన మొత్తం 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకలో అధిక శాతం ఈ రెండింటికే ఉంటుందని పేర్కొంది. దీని ప్రతిపాదనలను మైనింగ్‌శాఖకు అప్పగించింది.
పెంచిన రిజర్వాయర్ల సామర్థ్యాలకు అనుగుణంగా...ప్రాణహిత పాత డిజైన్‌లో నిర్ణీత 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు తగిన సామర్థ్యం గల రిజర్వాయర్లు లేనందున కొత్త రిజర్వాయర్లు నిర్మించడంతోపాటు పాత వాటి సామర్థ్యాలను భారీగా పెంచడం తెలిసిందే. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచగా, కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 7 టీఎంసీలకు పెంచారు. గంధమలలో 9.87 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. కామారెడ్డి నియోజకవర్గంలో 4, ఎల్లారెడ్డిలో 3 రిజర్వాయర్లను కొత్తగా ప్రతిపాదించారు.
మొత్తంగా 144 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ల నిర్మాణానికి పూనుకున్నారు. పెరిగిన సామర్థ్యాలకు అనుగుణంగా ఓపెన్ చానల్, టన్నెళ్లు, పంప్‌హౌస్, కాల్వల నిర్మాణానికి 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరాలు ఉంటాయని గుర్తించారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న 5 రిజర్వాయర్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలకు 27 లక్షల క్యూబిక్ మీటర్లు అంచనా వేశారు. ఇక ఏఎంఆర్‌పీకి 5.5ల క్షలు, దేవాదుల 4లక్షలు, కిన్నెరసాని 2.5లక్షలు, సీతారామ ఎత్తిపోతలు 1.10లక్షలు, మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లకు 1.28లక్షలు, పెనుగంగ 2లక్షలు, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులకు 2.4లక్షలు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. కాగా, క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.550 వరకు చెల్లించాల్సి ఉంటుందని, ఈ భారమంతా ప్రాజెక్టు వ్యయంలోనే ఉంటుందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.
‘పాలమూరు’కు పూర్తిగా రాతి ఇసుక
అత్యంత భారీ వ్యయంతో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల్లో పూర్తిగా రాతి ఇసుకను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుకకు ప్రత్యామ్నాయంగా ‘రాక్‌శాండ్’కు ప్రాధాన్యమిస్తే మెరుగైన ఫలితాలుంటాయని నేషనల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొన్న నేపథ్యంలో దీనివైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. మొత్తంగా కోటి క్యూబిక్ మీటర్ల మేర రాతి ఇసుక అవసరాలు ఉంటాయని ఇప్పటికే లెక్కలేసిన అధికారులు మహబూబ్‌నగర్ జిల్లాలో దీని లభ్యత సమృద్ధిగా ఉన్న ప్రదేశాలను గుర్తించారు.
‘కాళేశ్వరానికి’ 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక
Published Mon, Jul 11 2016 1:51 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement