- విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట
- శాసన సభాపతి మధుసూదనాచారి
భూపాలపల్లి : అటవీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్‌లో పీహెచ్‌సీ ఆవరణలో నిర్మించిన డాక్టర్ నివాస గృహాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని, రైతుల వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గంలో బొగ్గు, గోదావరి జలాలు అందుబాటులో ఉన్నందున బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాంత సమస్యలన్నీ తనకు తెలిసినవేనని, ఒక్కొక్కటిగా పరిష్కరించుకుం టూ వస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, కరెంటు కనీసం నాలుగు గంట లు కూడా ఉండటం లేదని, పీహెచ్‌సీలో మరో వైద్యుడిని నియమించడంతోపాటు కళాశాల సమయాల్లో బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. స్పందించిన స్పీకర్ ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
అనంతరం నాగారంలో ఇటీవల జ్వరంతో మృతి చెందిన చొల్లేటి జగన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. తర్వాత రాంపూర్‌లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిం చారు. స్పీకర్ వెంట వైద్య, ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ నాగేశ్వర్‌రావు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఎ శ్రీరాం, డిప్యుటీ డీఎంహెచ్‌ఓ దయానందస్వామి, ఎస్‌పీహెచ్‌ఓ మధుసూదన్, డీఎంఓ అన్సారీ, జెడ్పీటీసీ జర్పుల మీరాబాయి, ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావ్, వైస్‌ఎంపీపీ తాళ్లపెల్లి సురేందర్, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ బండారి సంపూర్ణ, స్థానిక వైద్యుడు సునీల్‌దత్, టీఆర్‌ఎస్ నాయకుడు కుంచాల సదావిజయ్‌కుమార్, మందల రవీందర్‌రెడ్డి, మేకల సంపత్‌కుమార్‌యాదవ్, క్యాతరాజు సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.