టికెట్ల రేట్ల పెంపు విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయి. ధరలు పెంచే ముందు తమను సంప్రదించడంగానీ, అనుమతిగానీ తీసుకోలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. నగరంలో ఇప్పటివరకూ 79 థియేటర్లు టికెట్ల ధరలు పెంచినట్లు మా దృష్టికి వచ్చింది.– మంత్రి తలసాని
కోర్టు ఉత్తర్వుల మేరకు ధరలు పెంచాం. గురువారం ఉదయం నుంచి పలు థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.25 నుంచి రూ.50 వరకు పెంపు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. పెంచిన టికెట్ల ధరలు ఏపీలోనూ వర్తింపజేస్తాం. అయితే ఈ పెంపు 2 వారాలు మాత్రమే. – నిర్మాతల మండలి
వేసవిలో పిల్లాపాపలతో సినిమాలకు వెళదామనుకుంటే.. ఒక్కో టికెట్‌పై ఏకంగా రూ.70 పెంచడం సరికాదు. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నాం.. ఇపుడు టికెట్ల ధరలు కూడా పెంచితే సినిమాకు వెళ్లే పరిస్థితే ఉండదు. – సామాన్యుడి గగ్గోలు
సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరల పెంపు థియేటర్ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య ‘టికెట్ వార్’కు తెరతీసింది. ప్రభుత్వం అనుమతితోనే టికెట్ల ధరలు పెంచామని థియేటర్ యాజమాన్యాలు చెబుతుంటే.. తమనెవరూ సంప్రదించలేదని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని స్పష్టం చేశారు. యాజమాన్యాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ధరలు పెంచాయన్నారు. థియేటర్ యాజమాన్యాలపై కోర్టుకెళ్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పడంతో ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాల మధ్య వివాదం తీవ్రతరం కానుంది.
అన్ని అనుమతులు ఉన్నాయి
కోర్టు ఉత్తర్వుల మేరకు ధరలు పెంచామని థియేటర్లు, మల్టీపెక్స్‌ల నిర్వాహకులు బుధవారం సాయంత్రం ప్రకటించారు. గురువారం ఉదయం నుండి పలు థియేటర్లలో ప్రతి టికెట్‌పై రూ.25 నుండి 50 రూపాయల వరకు అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సింగిల్ థియేటర్ యజమానులు మూడ్రోజుల క్రితమే పెంచిన ధరలను గురువారం నుండి అమలు చేస్తామని ప్రకటించగా, మల్టీపెక్స్‌ల నిర్వాహకులు మాత్రం ఆన్‌లైన్ టికెట్ల ధరలను బుధవారం సాయంత్రం వరకు ఆయా వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచలేదు. చివరకు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రతి టికెట్‌పై రూ.50 పెంచుతూ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించారు. అయితే కోర్టు ఉత్తర్వులపై సవాల్ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టకపోవటంతో పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. తాము కోర్టును ఆశ్రయించే టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి తీసుకున్నామని నిర్మాతల మండలి ప్రతినిధి దిల్ రాజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పెంచిన టికెట్ల ధరలు ఏపీలోనూ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. అందుకే తాము సింగిల్ థియేటర్లలో టికెట్ ధర రూ.80 నుంచి 110, మల్లీప్లెక్స్‌లో రూ.130 నుంచి 200 వరకు పెంచామని యజమానులంటున్నారు. ఈ పెంపు 2వారాలు మాత్రమేనన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలోని ఓ సింగిల్ థియేటర్‌లో సినిమా చూడాలంటే రూ.30 కనీస టికెట్ ధరగా ఉండగా.. సెకండ్ క్లాస్‌లో రూ.60 ఉన్న ధరను రూ.80, బాల్కనీ అయితే రూ.100 నుండి 125కి పెంచేశారు. అదే మల్టీపెక్స్ విషయానికి వస్తే ఖైరతాబాద్‌లోని ఐమాక్స్‌లో స్మాల్ స్క్రీన్ టికెట్ ధర రూ.138 నుండి రూ.200, బిగ్‌స్క్రీన్ అయితే రూ.250 నుండి రూ.300లకు పెంచి విక్రయించారు.
సీఎస్, అధికారులతో మంత్రి సమీక్ష
టికెట్ల పెంపు వ్యవహారంపై తమ దృష్టికి రాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారమే వెల్లడించారు. కాగా, టికెట్ల పెంపు అంశం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశం కావడంతోబుధవారం మంత్రి ఈ వివాదంపై సమీక్ష నిర్వహించారు. సీఎస్, అధికారులతో కలిసి ఈ విషయంపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల రేట్లు పెంపు విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరించాయని అన్నారు. ధరలు పెంచేముందు తమను సంప్రదించడంగానీ, అనుమతిగానీ తీసుకోలేదని అసలు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మంత్రి స్పష్టంచేశారు. నగరంలో ఇప్పటివరకూ 79 థియేటర్లు టికెట్ల ధరలు పెంచినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తలసాని వెల్లడించారు. ప్రజలపై భారం పడేలా టికెట్ల ధరలు పెంచడం సరికాదన్నారు. ఇందుకు తామెలాంటి అనుమతి ఇవ్వలేదని పునరుద్ఘాటించారు. సామాన్యుడికి కూడా వినోదం కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో తాము హోంశాఖ, న్యాయశాఖలతోనూ సంప్రదింపులు జరిపామన్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే తాము కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు.
సామాన్యుల గగ్గోలు
టికెట్ల ధరల పెంపు రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. వేసవి సెలవులు కాబట్టి, పిల్లాపాపలతో సినిమాలకు వెళ్లి సరదాగా గడుపుతామని అనుకుంటే.. ఒక్కో టికెట్‌పై ఏకంగా 70 రూపాయలు పెంచడంపై ప్రజలు మండిపడుతున్నారు. థియేటర్లలో ఇంతకాలం తినుబండారాల విషయంలో దోపిడీకి గురవుతూ వస్తున్నాం.. ఇపుడు టికెట్ల ధరలు కూడా పెంచితే.. సినిమాకు వెళ్లే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. ఇపుడున్న ధరలతో నలుగురు సభ్యులున్న కుటుంబం మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళితే.. టికెట్లకు రూ.800పోగా, ఇంటర్వెల్‌లో తినుబండారాలకు రూ.300 నుంచి రూ.400 వరకు వాచిపోవడం ఖాయం. మొత్తంగా ఈ ఖర్చు రూ.1200 వరకు చేరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment