ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : ‘కరోనా మహమ్మారే కావచ్చు.. కానీ, సూది మందులు, ఇతర మెడిసిన్స్‌తో కంటే వైద్యులిచ్చిన మనో ధైర్యంతోనే దానిని జయిం చాం’ అని చెబుతున్నారు ఆ వైరస్ బారి నుంచి విజయ వంతంగా బయటపడిన వారు. 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న వీరు.. ఒంటరిగా గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. వైద్యులు, కుటుంబసభ్యులు వెన్నుదన్నుగా నిలవడంతోనే కరోనాను జయించామని చెప్పారు. మొండి వైరస్‌ను గుండెధైర్యంతో ఎదుర్కొన్న వీరంతా.. ముఖ్యంగా గాంధీ ఆస్పత్రిలో నర్సుల నుంచి వైద్యుల వరకు అందించిన సేవలను, తమలో మానసిక స్థైర్యాన్ని కలిగించిన తీరును గుర్తుచేసుకున్నారు. తమకు పాజిటివ్ వచ్చిన దగ్గరి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు కలిగిన అనుభవాలను వారంతా పంచుకున్నారు.
గాంధీ వైద్యులు గ్రేట్..
నేను లండన్‌లో ఓ యూనివర్సిటీలో ‘ఎమర్జెన్సీ పారామెడికల్’ కోర్సు చదువుతున్నా. మార్చి 19న హైదరాబాద్ వచ్చాను. అప్పటికే ఇక్కడ వైరస్ విస్తరించడంతో ఆందోళన చెందాను. విమానంలో థర్మోస్కానింగ్ కూడా చేశారు. క్వారంటైన్‌కు తరలించారు. ఆ తర్వాత బాధ్యతగా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. వైరస్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంతో ఆశ్చర్యపోయా. నేను కరోనా బారినపడటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వైద్యం చేయించుకున్న తర్వాతే ఇంటికి వస్తానని చెప్పాను. 15 రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాను. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నా. గాంధీ ఆస్పత్రి వైద్యుల సేవలు మరిచిపోలేను.
– గచ్చిబౌలి యువకుడు (25)
కరోనా వైరస్‌ను మనోధైర్యంతోనే ఎదుర్కోవాలి. మందులు, సూదుల కంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రోత్సాహమే బలాన్నిస్తుంది. దీంతోనే నేను కరోనాను జయించాను. కంపెనీ పనిపై లండన్ వెళ్లి మార్చి మొదటి వారంలో ఇండియా వచ్చా. అప్పుడప్పుడే కరోనా వైరస్ వ్యాప్తి గురించి విన్నా.. కానీ ఆ వ్యాధిలో పేర్కొన్న లక్షణాలేవీ నాలో కనిపించలేదు. కానీ కాస్త జ్వరంగా అనిపించింది. మూడు రోజులైనా తగ్గకపోయేసరికి అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న మా సిస్టర్‌ను సంప్రదించా. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోమన్నారు. గాంధీలో చేయిస్తే పాజిటివ్ వచ్చింది. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. గాంధీ ఆస్పత్రిలో పద్నాలుగు రోజులు స్నానం లేకుండా ఒంటరి జీవితం గడిపా. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో ఆ వెలితి తెలియలేదు. ఇక వైద్యులు రోజుకు పలుమార్లు వచ్చి నా పరిస్థితిని సమీక్షించేవారు. పౌష్టికాహారం అందించారు. ముఖ్యంగా వారిచ్చిన మనోధైర్యం మరిచిపోలేనిది. నేను మళ్లీ ఈరోజు సాధారణస్థితికి రావడానికి నా సిస్టర్‌తో పాటు గాంధీ వైద్యులు పోషించిన పాత్ర జీవితాంతం మరిచిపోను.
– సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (49), కోకాపేట
ఒత్తిడి పడ్డా.. ధైర్యం చెప్పారు!
ఎన్నో ఆశలతో లండన్ వెళ్లాను. అక్కడ ఎంబీఏ చదువుతున్నా. కరోనా వైరస్ లండన్‌లో వ్యాపిస్తోందన్న భయంతో మార్చి 16న స్నేహితురాళ్లతో కలిసి లండన్ నుంచి బయల్దేరి 19న హైదరాబాద్ వచ్చాం. నాతో పాటు వచ్చిన ఇద్దరు ఏపీకి వెళ్లారు. అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. నన్ను రాజేంద్రనగర్ క్వారంటైన్‌లో ఉంచారు. మార్చి 20న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనపడ్డా. ఈ సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది అండగా నిలిచారు. ఏమీ కాదని, త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారంటూ కౌన్సెలింగ్ చేసి ధైర్యాన్నిచ్చారు. దీనికి కుటుంబసభ్యుల ప్రోత్సాహమూ తోడైంది. ఆ బలంతోనే వైరస్‌ను జయించగలిగాను.
– గుంటూరు జిల్లాకు చెందిన యువతి (25)
మొండి ధైర్యంతో బయటపడ్డా..
ఉమ్రా యాత్రకు వెళ్లొచ్చాక దగ్గు, జ్వరం వస్తే సాధారణమే అనుకున్నా. స్థానిక డాక్టర్‌కు చూపించుకుంటే మందులిచ్చి పంపారు. కానీ ఎంతకూ తగ్గలేదు. మార్చి 23న గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది. అందులోనూ బీపీ, షుగర్ ఉన్న వారికి హైరిస్క్ ఉంటుందని చెప్పారు. కానీ మొండి ధైర్యంతో, వైద్యుల సపోర్ట్‌తో 14 రోజులు గాంధీలో గడిపేయడంతో కరోనా నన్నేమీ చేయలేకపోయింది. చివరకు నెగెటివ్‌గా రావటంతో శనివారం నన్ను డిశ్చార్జి చేశారు. గాంధీలో మధ్యాహ్న భోజనం ఆలస్యమ య్యేది. షుగర్ ఉండటంతో గాబరా అయ్యేది. అయితే వైద్యుల ప్రోత్సాహం నన్ను మళ్లీ సాధారణ మనిషిని చేసింది.
– బేగంపేట పాటిగడ్డకు చెందిన మహిళ (61)
Comments
Please login to add a commentAdd a comment