కోల్‌కతా ఘటనపై తీవ్ర ఆగ్రహం
ఎక్కడికక్కడ నిరసనల హోరు
ఓపీ సేవల నిలిపివేత.. ఆందోళన బాట
సాక్షి, హైదరాబాద్: వైద్య లోకం కన్నెర్రజేసింది.. కోల్‌కతాలో జరిగిన అమానవీయ ఘటనను ఖండించింది. పీజీ విద్యారి్థపై అమానుషంగా దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో నినదించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా.. వైద్యుల నిరసనల కారణంగా పలు ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నిరసనల హోరు..
నగరంలో శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిమ్స్, సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ, గాంధీ ఆస్పత్రి వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఓపీ సేవలు నిలిపేసి ఆస్పత్రుల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కోల్‌కతా వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నేషనల్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆర్‌వీ అశోకన్‌కు పలువురు వైద్యులు లేఖలు రాశారు.
నో సేఫ్టీ.. నో డ్యూటీ
నిమ్స్ వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కోల్‌కతా ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిమ్స్ రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరింది. శుక్రవారం విధులను బహిష్కరించారు. నిమ్స్ వైద్య బోధనా సిబ్బంది, నర్సులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నిమ్స్‌లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని నిమ్స్ నర్సెస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ కుమారి డిమాండ్ చేశారు.
‘ఉస్మానియా’లో భారీ ర్యాలీ..
ఉస్మానియా జూనియర్ వైద్యుల సంఘం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉస్మానియా దంత కళాశాల నుంచి కోఠి ఉస్మానియా మెడికల్ కాలే జీ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయాలన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని కులీకుతుబ్‌షా భవనం మీదుగా ఓపీ బ్లాక్ వరకు 2 వేల మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
గాంధీ, ఈఎస్‌ఐసీలోనూ..
గాం«దీలో ఆస్పత్రిలో కూడా నిరసనలు కొనసాగాయి. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించిన జూడాలు నినాదాలు చేస్తు ర్యాలీ నిర్వహించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్, జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణలు స్పష్టం చేశారు. జూడాలు చేపట్టిన ఆందోళనకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, లెప్రసీ విభాగాలు సంఘీభావం ప్రకటించాయి.
నేడు నిమ్స్ ఓపీ సేవలు బంద్..
నిమ్స్ ఆస్పత్రిలో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్టు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిమ్స్‌లో ఓపీ సేవలు ఉండవన్నారు. శస్త్ర చికిత్సలను కూడా వాయిదా వేశామని చెప్పారు. అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.
మహిళా వైద్యులకు రక్షణ లేదు..
ఉస్మానియా ఆస్పత్రిలో మహిళా వైద్యులకు భద్రతా సదుపాయాలు లేవు. విధులు నిర్వర్తించిన తర్వాత సరైన విశ్రాంతి గదులు లేవు. బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేవు. ఆస్పత్రి ప్రాంగణాల్లో సరిపడా సీసీ కెమెరాలు లేవు. రాత్రి వేళల్లో ఒక వార్డు నుంచి మరో వార్డుకు వెళ్లాలంటే భయం వేస్తోంది.
– డాక్టర్ చంద్రికారెడ్డి జూనియర్ వైద్యురాలు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి
దాడులు సరికాదు..
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు ఎలా చేయాలి? చిన్న చిన్న విషయాలకే డాక్టర్లపై దాడులు చేయడం సరికాదు. కోల్‌కతా లాంటి సంఘటనలు జరగడం శోచనీయం. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించాలి. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు చేయడం ప్రజలకే నష్టం. – శ్రీదేవి,
వైద్యురాలు, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment