సాక్షి, హైదరాబాద్ : కరోనా దెబ్బకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు కుదేలవుతున్నాయి. కానీ సగానికిపైగా జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉంది. మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇప్పటి వరకు 30 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, గద్వాల జిల్లాలను కరోనా వణికిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అయితే మొదట్లో కేసులు నమోదైన కరీంనగర్, వరంగల్ అర్బన్ వంటి జిల్లాల్లో పరిస్థితి అదుపు లోకి వచ్చింది. జిల్లాల్లో సగానికిపైగా పరిస్థితి నియంత్రణలోకి వస్తున్నట్లు వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అక్కడి యంత్రాంగం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నందు వల్ల పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని పేర్కొంటున్నాయి.
కఠినంగా వ్యవహరించడం వల్లే..
కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కేసులు పెరుగు తున్నాయని యంత్రాంగం భావిస్తోంది. కేసులు తక్కువగా, కొన్ని రోజులుగా నమోదు కాని జిల్లాల్లో లాక్‌డౌన్ అమలు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలో మర్కజ్ నుంచి 72 మంది వస్తే కేసుల సంఖ్య 3 మాత్రమే. కానీ సూర్యాపేట జిల్లాలో 12 మంది మర్కజ్‌కు వెళ్లి రాగా, వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకరి ద్వారానే ఏకంగా 81 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషించాయి. చదవండి: కరోనా: తమిళ నటుడు భూదానం
అంటే జగిత్యాలలో తీసుకున్న జాగ్రత్తలు, సూర్యాపేటలో తీసుకో లేదని అర్థమవుతోంది. ఇలా కొన్ని జిల్లాల యంత్రాం గాలు వేగంగా స్పందించక పోవడం, లాక్‌డౌన్‌పై నిర్లిప్తత వల్ల విఫలమయ్యాయి. కానీ చాలా జిల్లాలు సీఎం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేశాయి. ఉన్న జిల్లాలు కరీంనగర్, సిరిసిల్ల, మహబూబాబాద్, పెద్దపల్లి, ములుగు, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి తదితర జిల్లాలు నియంత్రణలో ఉన్నాయి. ఇంకొన్ని జిల్లాలో అడపాదడపా కేసులు నమోదవుతున్నా పరిస్థితి అదుపులో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ జిల్లాల వారీగా పరిస్థితి..
► వనపర్తి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ జిల్లా నుంచి 13 మంది ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి రాగా.. వారిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేశారు. పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేశారు.
► యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మర్కజ్ అనుమానితులను గుర్తించడం, వారిని ఐసోలేషన్ చేయడం, వారి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేయడంతో పూర్తి నియంత్రణలో ఉంది. అన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: వర్సిటీల ఆన్‌లైన్ బోధన
►వరంగల్ రూరల్ జిల్లాలో కూడా ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు. చెక్‌పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అధికంగా కేసులు నమోదైనా ఈ జిల్లాలో ఒక్కటీ లేకపోవడానికి యంత్రాంగం తీసుకున్న చర్యలే కారణం.
►మెదక్ జిల్లాలో గత 15 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. చివరగా ఈ నెల 8న ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో మొత్తం 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురికి నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వీరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. పాజిటివ్ బాధితులతో కాంటాక్ట్ అయిన వ్యక్తులు అందరినీ క్వారంటైన్‌లో ఉంచారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడడంతో పాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో వైరస్ వ్యాప్తి జరగలేదు.
► జగిత్యాల జిల్లాలో 9 రోజుల కిందట పాజిటివ్ కేసు నమోదైంది. దాంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన 1,040 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. మర్కజ్ నుంచి వచ్చిన 72 మందిని ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఈ నెల 15న పాజిటివ్‌గా తేలిన కేసు కూడా గుంటూరు నుంచి వచ్చిన ఐదేళ్ల బాలుడిది. బాలుడి వెంట వచ్చిన తాతకు నెగెటివ్ వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా బాలుడి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని ఐసోలేషన్‌కు తరలించి, పరీక్షలు నిర్వహించారు. వీరందరికి నెగిటివ్ వచ్చింది.
►నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 2 మాత్రమే నమోదు అయ్యాయి. గత 20 రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని మొదట్లోనే గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. మర్కజ్ వెళ్లి వచ్చిన 11 మందిని గుర్తించి వారిని పరీక్షించగా, వారిలో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్ వాళ్లను గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచారు. లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్లే కరోనా కట్టడి చేయగలిగారు.
► మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 8న చివరి కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 కేసులు మర్కజ్ లింకు ఉన్నవి కాగా.. మిగిలినవి వైద్య, ఆరోగ్య శాఖలో పని చేసే ఇద్దరికి, వారిలో ఒకరి తల్లికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు, వారితో సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు పంపారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడమే కేసులు పెరగకపోవడానికి కారణం.
►నారాయణపేట జిల్లాలో 2 నెలల బాబుకు ఈ నెల 15న పాజిటివ్ వచ్చి 17న చనిపోయాడు. తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అప్రమత్తమైన అధికారులు బాబు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు 14 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపగా అందరికీ నెగెటివ్ వచ్చింది.
►భద్రాద్రి కొత్తగూడెంలో 30 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అప్పటివరకు 4 కేసులు నమోదయ్యాయి. వారికి తర్వాత నెగెటివ్ వచ్చింది. వాళ్లు డిశ్చార్జ్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్, ఏపీ సరిహద్దులు మూసేసి గట్టి నిఘా పెట్టడంతో పాటు విదేశాల నుంచి వచ్చిన 243 మందిని, మర్కజ్ నుంచి వచ్చిన 10 మందిని, వారితో కలిసిన వారిని క్వారంటైన్‌లో పెట్టడంతో పాటు.. లాక్ డౌన్ పక్కాగా అమలు చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరించారు.
►సిద్దిపేట జిల్లాలో గత 22 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా కోలుకున్నాడు. డిశ్చార్జ్ చేశారు. వైరస్ వ్యాపి చెందకుండా మంత్రి హరీశ్‌రావు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఆయన స్వయంగా వెళ్లి లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు గ్రామాల్లో ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. చదవండి: రైతుల్ని ఆదుకొనేదెవరు?
► భూపాలపల్లి జిల్లాలో 10 రోజుల నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. చివరి కేసు ఈ నెల 12న నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో 3 కేసులే నమోదయ్యాయి. ఇవి మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా ఆయన భార్య, కూతురుకు సోకింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తిని వెంటనే క్వారంటైన్ చేశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 39 మందిని గుర్తించారు. జిల్లా నుంచి ఒకే వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రావడం కూడా కేసులు పెరగకపోవడానికి ప్రధాన కారణం. అలాగే చుట్టు పక్కల జిల్లాలైన ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాల నుంచి వచ్చే సరిహద్దులను పూర్తిగా మూసేయడం కూడా కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి దోహదపడింది.
►మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళ (46) ఈ నెల 14న హైదరాబాద్‌లో కింగ్ కోఠి ఆస్పత్రిలో మరణించింది. పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. ఆమెకు వైరస్ ఎలా సోకిందో ఇప్పటికీ మూలం దొరకలేదు. అప్పటివరకు మంచిర్యాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లా యంత్రాంగం మహారాష్ట్ర నుంచి వచ్చే సరిహద్దుల్లో నిత్యం నిఘా ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment