జక్లేర్‌లో రెడ్‌ అలర్ట్‌.. | Coronavirus Cases Rising in Mahabubnagar | Sakshi
Sakshi News home page

భయం గుప్పిట్లో కొండారెడ్డిపల్లి

Published Fri, May 29 2020 1:04 PM | Last Updated on Fri, May 29 2020 1:04 PM

Coronavirus Cases Rising in Mahabubnagar - Sakshi

జక్లేర్‌లో ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది

మహబూబ్‌నగర్‌, వంగూరు (కల్వకుర్తి): మండలంలోని కొండారెడ్డిపల్లి వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా సోకిన గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బుధవారం మధ్యరాత్రి మృతిచెందగా.. అతని అంత్యక్రియలు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ శ్మశాన వాటికలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు బలమైన గాయమవడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకినప్పటికీ అతని మృతికి మాత్రం తలకు తగిలిన గాయమే కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తలకు శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్య, తల్లి, మేనత్త, కొడుకుకు కరోనా పరీక్ష నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కొండారెడ్డిపల్లిలో కరోనా కలకలం సృష్టించిందని గ్రామస్తులు వాపోతున్నారు.

వ్యవసాయ పనులకే అనుమతి
కొండారెడ్డిపల్లి నుంచి ఎలాంటి రాకపోకలు జరపకుండా గ్రామానికి ఉన్న నాలుగు ప్రధాన రోడ్లను పోలీసులు దిగ్బంధించారు. దీంతో గ్రామానికి ఇతర వ్యక్తులు రావడం కాని.. గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా లేకుండా పోయింది. గ్రామంలో నివసిస్తున్న వారు వ్యవసాయ పనులు మినహా ఇతర ఏ పనులకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. గురువారం పోలీసులు చేపడుతున్న చర్యలను కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పర్యవేక్షించారు. ఆయన గ్రామానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. దీంతో గ్రామం మొత్తం హోం క్వారంటైన్‌గా మార్చేశారు. ఇదిలా ఉంటే వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నాలుగు టీంలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న వారెవరూ లేరని తెలిసింది.

వలస కూలీలకు పరీక్షలు
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వలస కూలీలు గుంటూరు నుంచి ఇటీవల వంగూరుకు చేరుకున్నారు. వారందరినీ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో క్వారంటైన్‌ చేశారు. వీరికి సైతం బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోసారి పరిశీలించిన అనంతరం వారిని వారి వారి ఇళ్లకు పంపుతామని వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వంగూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులకు గురువారం పీహెచ్‌సీ సిబ్బంది హైడ్రాక్సీ క్లోరోఫిన్‌ మాత్రలు అందజేశారు.

ఏడుగురికి నెగెటివ్‌ రిపోర్ట్‌
నాగర్‌కర్నూల్‌ క్రైం: వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ఏడుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు క లెక్టర్‌ ఈ.శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరో నా పాజిటివ్‌ రావడంతో అతని ప్రైమరీ కాంటాక్ట్‌ ఏడుగురి నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు హైదరాబాద్‌కు పంపగా ని ర్ధారణ పరీక్షల్లో ఏడుగురికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందన్నారు. అయితే వీరంతా వైద్యుల పర్యవేక్షణలో 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

జక్లేర్‌లో రెడ్‌ అలర్ట్‌
మండలంలోని జక్లేర్‌లో వైద్యాధికారులు ఇంటింటికి తిరిగి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. గ్రామానికి చెందిన ఓ చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామానికి రాకపోకలను నిలిపివేశారు. కరోనా సోకిన చిన్నారి తల్లి సుమిత్రకు గురువారం హైదరాబాద్‌లో రక్త పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈమెకు ఏమైనా పాజిటివ్‌ ఉందా అనే అనుమానంతో డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. అలాగే చిన్నారి ఇంటి చుట్టుపక్కల వారందరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. రెండోరోజు దాదాపు 8 మందికి  ఇళ్లలో ఇంటింటా సర్వే చేస్తులన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే వారికి చికిత్స చేస్తున్నారు. తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, సీఐ శంకర్, ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ గ్రామాన్ని సందర్శించి ఎప్పటికప్పటి సమాచారం తెలుసుకుంటున్నారు. క్యాంపులో  అధికారులు తిరుపతి, ఆర్‌ఐ సురేష్, కృష్ణారెడ్డి, వీఆర్‌ఓ సుధారాణి, సర్పంచ్‌ నర్సింహులు తదితరులున్నారు.

పారేవులలో హోం క్వారంటైన్‌
మండలంలోని పారేవులలో ఆరు మందిని హోం  క్వారంటైన్‌లో ఉంచడంతో గురువారం గ్రామానికి డాక్టర్‌ నరేష్‌చంద్ర, వైద్య సిబ్బంది వచ్చి వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. అందరూ ఇంట్లో ఉండాలని, 14 రోజుల వరకు బయటకు రావొద్దని సూచించారు. వీరు ఈ నెల 14న జక్లేర్‌లో కరోనా   వచ్చిన చిన్నారి డోలారోహనం కార్యక్రమానికి    వెళ్లడంతో అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement