సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం కొత్తగా 11 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 1001కి చేరింది. తాజాగా 9 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 316కి చేరింది. ఆదివారం కోలుకున్నవారిలో మర్కజ్‌తో కాంటాక్ట్ అయిన 75 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 660 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 25 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బులిటెన్ విడుదల చేశారు. ఆదివారం నమోదైన 11 కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 540 కేసులు నమోదు కాగా.. చనిపోయిన 25 మందిలో 18 మంది జీహెచ్‌ఎంసీకి చెందినవారే ఉన్నారు. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో 18,756 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతి పది లక్షల మంది జనాభాలో 468 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
44 శాతం 20–40 ఏళ్ల యువకులే...
తెలంగాణవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 44 శాతం మంది కేవలం 20–40 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు. ఆ వయస్సువారు పనుల్లో ఉండటం, ఎక్కువగా బయటకు రావడం వంటి కారణాల వల్ల వారు అధికంగా వైరస్ బారిన పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం నాటికి నమోదైన మొత్తం కేసుల ఆధారంగా ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారన్న వివరాలను వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. 24 శాతం కేసులు 20–30 ఏళ్ల వారివే ఉన్నాయి. 20 శాతం కేసులు 30–40 మధ్య వయస్కుల్లో నమోదయ్యాయి. ఐదేళ్లలోపు చిన్నారులు 5 శాతం మంది ఉన్నారు.
రంజాన్ ఉపవాస దీక్షల్లో 175 మంది కరోనా బాధితులు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): గాంధీ ఆస్పత్రిలో 175 మంది కరోనా బాధితులు రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టినట్లు తెలిసింది. ఉపవాస దీక్షలపై గాంధీ వైద్యులు నిర్వహించిన కౌన్సెలింగ్ సత్ఫలితాలివ్వడంతో దీక్షలు చేపట్టినవారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 640 మంది కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో ముస్లిమేతరులు 92 మంది కాగా, మరో 90 మంది చిన్నారులున్నారు. మిగతా 458 మందికి వైద్యులు గత రెండు మూడ్రోజులుగా కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిసింది. కరోనాతో బాధపడుతూ ఉపవాస దీక్షలు చేపట్టడం ఆరోగ్యరీత్యా మంచిది కాదని, భారతీయ వైద్యచట్టాలు కూడా అంగీకరించవని బాధితులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సుమారు 175 మంది మతాచారం ప్రకారం దీక్షలు కొనసాగిస్తామని స్పష్టంచేయడంతో వారి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన దరఖాస్తులపై సంతకాలు తీసుకున్నారు. వారికి నిర్ణీత వేళల ప్రకారం ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిసింది.
నేటి నుంచి ప్లాస్మా థెరపీ షురూ...
గాంధీ ఆస్పత్రిలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ ప్రారంభించేందుకు ఆస్పత్రి పాలనా యంత్రాంగం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సర్టిఫికెట్లు సోమవారం అందే అవకాశం ఉందని, అదే రోజు ప్లాస్మా థెరపీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓ వైద్య అధికారి వెల్లడించారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సుల వసతి కోసం ప్రభుత్వం వివిధ హోటళ్లలో 77 రూములు బుక్ చేసింది. ఆసుపత్రుల్లో విధుల అనంతరం వారు నేరుగా హోటల్ రూమ్‌కే వచ్చి విశ్రాంతి తీసుకుంటారు.
ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్...
కుషాయిగూడ(హైదరాబాద్): హైదరాబాద్ మీర్‌పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్ వెంకటేశ్వరనగర్ కాలనీలో ఆదివారం మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో శనివారం మృతి చెందారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించిన సమయంలో అతని కుటుంబ సభ్యులు ఏడుగురితో పాటు పక్కింటికి చెందిన ఇద్దరిని క్వారైంటైన్‌కు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో మృతుడి భార్య, కొడుకు, కూతురు, అల్లుడితో పాటుగా ఏడాది వయసున్న మనవరాలికి పాజిటివ్‌గా తేలింది.
(చదవండి: రక్తదానం చేసిన కేటీఆర్..)
Comments
Please login to add a commentAdd a comment