![Coronavirus: Studies says that there is no Coronavirus In Indian Bats - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/16/BAT-1.jpg.webp?itok=TwqW9Lgn)
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని గబ్బిలాల్లో కరోనా (కోవిడ్–19) కారక సార్స్–సీవోవీ2 వైరస్ లేదని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే కేరళ, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులోని పీటెరోపస్ (ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్), రౌసెట్టూస్ (ఓల్డ్ వరల్డ్ ఫ్రూట్ బాట్స్) జాతి గబ్బిలాల్లో బ్యాట్ కరోనా వైరస్ (బీటీ సీవోవీ) ఉన్నట్లు గుర్తించారు. కరోనా కారక సార్స్–సీవోవీ–2 వైరస్‌కు బీటా కరోనా వైరస్‌ల మధ్య చాలా తేడాలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషుల్లో వ్యాధుల వ్యాప్తికి ఈ బ్యాట్ కరోనా వైరస్ కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని వెల్లడించారు. దీంతో భారత్‌లోని గబ్బిలాల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన నమూనాలపై తొలిసారి అధ్యయనం నిర్వహించి ఫలితాలను వెల్లడించారని చెప్పొచ్చు.
ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ ద్వారా గతంలో భారత్‌లో నిపా వైరస్ వ్యాప్తి చెందినట్లు అప్పట్లోనే గుర్తించిన విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేతృత్వంలోని పుణే, కేరళ నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు చండీగఢ్, తెలంగాణ, ఒడిశా, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, హిమాచల్‌ప్రదేశ్, కేరళలోని రెండు రకాల గబ్బిలాల జాతుల నుంచి దాదాపు 600 ‘స్వాబ్ శాంపిల్స్’సేకరించారు. గత డిసెంబర్‌లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని వివిధ రకాల గబ్బిలాల జాతుల నుంచి పుణే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే.
ఆ నమూనాలపై రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ–పీసీఆర్) పరీక్షలు నిర్వహించగా, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన కనీసం 25 నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ‘జూనాటిక్ ఇన్ఫెక్షన్స్’పై మరింత అధ్యయనం అవసరమని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశీలన ద్వారా కరోనా మహమ్మారి ఉధృతి నిలుపుదలకు ఏం చేయాలన్న దానిపై ఓ అంచనాకు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
వైరస్‌లకు రిజర్వాయర్లుగా..
ప్రస్తుతం పర్యావరణపరంగా, మనుషుల జీవన శైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనుషులు, ఇతర జంతువులు–గబ్బిలాల మధ్య తారసపడే సందర్భాలను గుర్తించడం సవాళ్లతో కూడుకున్న పని అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. పరిశోధనలో వెల్లడైన అంశాలను ఐసీఎంఆర్‌కు చెందిన ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. ‘గబ్బిలాలు చాలా వైరస్‌లకు న్యాచురల్ రిజర్వాయర్లుగా పరిగణిస్తుంటారని, వీటిలో కొన్ని మనుషులపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఇటీవల బయటడిన శ్వాసకోశ సంబంధిత సమస్యలకు దారితీసే సార్స్–సీవోవీ–2 కూడా గబ్బిలాలతో ముడిపడి ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గబ్బిలాల్లోని సహజ స్థావరాల్లో ఎలాంటి క్లినికల్ లక్షణాలను ఉత్పత్తి చేయట్లేదు. ప్రమాదవశాత్తు ఈ వైరస్‌లు మనుషులు, ఇతర జంతువులకు వ్యాప్తి చెందినప్పుడు శ్వాస కోశ, ఎంటరిక్, హెపాటిక్, నాడీ సంబంధిత వ్యాధుల్లో వివిధ తీవ్రతల్లో బయటపడొచ్చు. వీటిలో కొన్ని సీవోవీ వైరస్‌లు మాత్రమే మనుషులకు సోకుతున్నాయనేది ఇంకా అర్థం కావట్లేదు‘అని ఈ పరిశోధనల్లో కీలకపాత్ర పోషించిన పుణే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డా.ప్రగ్యా డి.యాదవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment