గోపాల్‌పేట (వనపర్తి): మండలంలోని పొలికెపాడు గ్రామానికి పోలీసులు, డాక్టర్లు, ఇతర అధికారులు చేరుకొని ఓ ఇంటివారిని ప్రశ్నల వర్షం కురిపించడంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 20వ తేదీన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఓలా క్యాబ్ బుక్ చేసి ఆటోలో హోటల్ సితార (లాడ్జ్) నుంచి ఆస్పత్రికి వెళ్లాడు. లండన్ నుంచి వ్యచ్చిన వ్యక్తి కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు, అధికారులు హైదరాబాద్‌లో అతడు ఎవరెవరిని కలిశాడు అనే విషయాలు తెలుసుకున్నారు. అందులో ఓలా క్యాబ్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో వివరాలు పరిశీలించగా, అతను గోపాల్‌పేట మండలం పొలికెపాడు గ్రామస్తుడిగా గుర్తించి వనపర్తి జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు.
దీంతో స్పందించిన అధికారులు ఆదివారం పొలికెపాడు గ్రామానికి చేరుకొని ఆటోడ్రైవరు, వారి కుటుంబాన్ని విచారించారు. ఆటో డ్రైవరు, అతని భార్య, తల్లి, కూతురును డాక్టర్ మంజుల, సీఐ సూర్యనాయక్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ అప్జలుద్దీన్ విచారించి నలుగురికి స్టాంపులు వేశారు. ప్రస్తుతం అతడికి ఎటువంటి జలుబు, ఇతర లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మధ్యాహ్నం అనంతరం కలెక్టర్ యాస్మిన్ భాష ఆదేశాల మేరకు ఆటోడ్రైవర్‌ను నాగోరం ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అంతేకాకుండా వారి ఇంటి పక్కల ఉన్న దాదాపు 18 మందికి స్టాంపులు వేసినట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment