గాంధీ హాస్పిటల్(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) తెలంగాణలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో మరో రెండు కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. సోమవారం గాంధీలో 47 మంది అనుమానితులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు తేలిందని తెలంగాణ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే పూర్తి స్థాయి నిర్ధారణ కోసం వారి నమూనాలను పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు వైద్యులు తెలిపారు. ఇద్దరు అనుమానితుల ఆరోగ్య వివరాలు రేపు(గురువారం) వెల్లడిస్తామని చెప్పారు.
తెలంగాణలో ఎక్కడా కరోనా కేసులు లేవని వైద్యులు స్పష్టం చేశారు. విదేశాల్లో పర్యటించి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిపారు. కరోనా గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని.. జలుబు, దగ్గు ఉన్నవారిలోనే కరోనా లక్షణాలు ఉంటాయని చెప్పారు. వీలైనప్పుడు చేతులు కడుక్కోవడం మంచిందని వైద్యులు సూచించారు. కరోనా అనుమానితుల్లో ఒకరు ఇటలీ నుంచి, మరోకరు బెంగళూరు నుంచి నగరానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కరోనా ఆందోళనల నేపథ్యంలో అనుమానితులు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. కరోనా భయంతో మైండ్ స్పేస్ వైపు వెళ్లేందుకు టెకీలు భయపడుతున్నారు. ఇప్పటికే మైండ్ స్పేస్‌లోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు దేశంలో పర్యటిస్తున్న 21 మంది ఇటలీ జాతీయుల్లో 16 మంది కరోనా వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ధారించింది. అలాగే ఢిల్లీలో ఒకటి, ఆగ్రాలో 6, కేరళలో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది.(చదవండి : హైటెక్ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!)
Comments
Please login to add a commentAdd a comment