సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 87.6 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 20,462కు చేరింది. ఇందులో 9,984 మంది చికిత్స పొందుతున్నారు. 10,195 మంది కోలుకున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 8 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 283కు చేరింది.
లక్ష దాటిన పరీక్షలు..
కరోనా పరీక్షలు రాష్ట్రంలో లక్ష దాటాయి. శుక్రవారం నాటికి 1,04,118 మందికి ఈ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 20,462 పాజిటివ్ కేసులు కాగా, 83,656 మందికి నెగెటివ్ వచ్చింది. పరీక్షలు చేసిన వాటిలో 19.65 శాతం మందికి పాజిటివ్ రావడం గమనార్హం. శుక్రవారం 5,965 మందికి పరీక్షలు చేయడా, 4,073 మందికి నెగెటివ్ రాగా, 31.71 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. \
గ్రేటర్‌లో భయం భయం..
కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,658 పాజిటివ్ కేసులు వచ్చాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో ఏకంగా 87.6 శాతం ఇక్కడే నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌లో 44, వరంగల్ రూరల్‌లో 41, సంగారెడ్డిలో 20, నల్లగొండలో 13, మహబూబ్‌నగర్‌లో 12, మహబుబాబాద్‌లో 7, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో 6 చొప్పున, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగుడెంలో 4, మెదక్, సిద్దిపేట, నిజామాబద్‌లో మూడు చొప్పున, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో రెండు చొప్పున, కరీంనగర్, గద్వాల, ములుగు, వరంగల్ అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి.
ఒకే ల్యాబ్‌లో 2,672 పాజిటివ్ కేసులు
ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేస్తున్న పరీక్షల తాలూకు ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ల్యాబ్ యాజమాన్యం ఆ మేరకు ఎంట్రీ చేసింది. ఈ ల్యాబ్‌లో 3,726 పరీక్షలు నిర్వహించగా.. అందులో ఏకంగా 2,672 పాజిటివ్ వచ్చాయి. తీసుకున్న నమూనాల్లో సగటున 71.7 శాతం పాజిటివ్ రావడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం షాక్‌కు గురైంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో ఇంతపెద్ద సంఖ్యలో పాజిటివ్ ఫలితాలు రాలేదని నిర్ధారించుకున్న అధికారులు.. ఆ ప్రైవేటు ల్యాబ్ ఫలితాలను నిలిపేశారు. వీటిని రాష్ట్ర పాజిటివ్ జాబితాలో కలపట్లేదని ప్రజారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఆ ప్రైవేటు ల్యాబ్‌ను సందర్శించి తనిఖీ చేయాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. తనిఖీ అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment