
గోదారున్నా... గొంతెండుతోంది
తలాపునే గోదావరి. పక్కనే ఎన్టీపీసీ. పరిధి
కార్పొరేషన్. విద్యుత్‌ప్లాంట్ సమీపంలోనే
12 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి ట్యాంకు. ఇంకేం... ఆ కాలనీ ప్రజలకు 24 గంటలు తాగునీరు... సౌకర్యాలకు ఏ కొదవా లేదనుకుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లభించవు. డ్రెయినేజీ సమస్య, బహిర్భూమికి బయటకెళ్లాల్సిందే. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఆదివారం ఉదయం నర్రశాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
-గోదావరిఖని
సోమారపు సత్యనారాయణ : బాగున్నారా...? శాలపల్లిలో ఇబ్బందులేమైనా ఉన్నాయా?
లక్ష్మి : మీదికి మంచిగనే ఉన్నం సారు... కానీ, మాకు చెప్పలేని బాధలున్నయ్. తాగే నీళ్లకు చానా తప్పలైతంది. పైపులైన్లు ఉన్నట్టే గని నీళ్లు మాత్రం వస్తలేవు. చాలా ఏండ్ల సంది నీళ్ల కోసం అరిగోసపడుతున్నం.
సోమారపు : ఇది ఎన్టీపీసీ పునరావాస ప్రాంతం కదా..? వాళ్లు పట్టించుకుంటలేరా?
రాధ : మా భూములు ఎన్టీపీసీకి అప్పగించినా... వారికి మా గురించి పట్టింపులేదు. ఊళ్లె రెండు చోట్ల ప్లాస్టిక్ ట్యాంకులు పెట్టి తాగేనీళ్లు ఇస్తమన్నరు. ఇప్పటికి ఏదీ లేదు.
సోమారపు: కార్పొరేషన్ నుంచి నీళ్లు వస్తలేవా?
లక్ష్మీ : ట్యాంకర్లు పంపిస్తున్నరు. గింతమందికి అవి ఏ మూలకు సరిపోతయ్ సారూ... కొంత మందికే సరిపోతున్నయ్. మిగతావాళ్లం నిన్నమొన్నటి నీళ్లతోనే సరిపెట్టుకుంటున్నం.
సోమారపు : ఏం బాబూ ఏం చదువుతున్నవ్?
బొద్దుల వెంకటేశ్ : సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నా. శాలపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నట్టేగానీ గ్రామ పంచాయతీలో ఉండే సౌకర్యాలు కూడా లేవు. ఎన్టీపీసీ దత్తత గ్రామమని చెబుతున్నా వాళ్లెప్పుడూ పట్టించుకోలేదు. పిల్లలకు కనీసం ఆడుకునేందుకు ఆట స్థలాలు కూడా లేవు.
సోమారపు అమ్మా పెన్షన్ ఇస్తున్నరా?
రాసకొండ విజయలక్ష్మి: సార్, మొన్నటిదాక పింఛిన్ వచ్చింది. ఇప్పుడింకా ఇవ్వలేదు. చిన్న దుకాణం పెట్టుకుని బతుకు ఎల్లదీత్తున్న. బ్యాంకు లోను ఇప్పియ్యండి సార్.
సోమారపు : బ్యాంకు వాళ్లతో, మహిళా సంఘాలతో మాట్లాడి రుణం ఇప్పిస్తానమ్మా.
సోమారపు : బాబూ... ఏం పనిచేస్తున్నవ్?
వెంకటేశ్వర్లు : నేను ఎన్టీపీసీలో క్యాజువల్ లేబర్‌ను. సార్, ఇక్కడ నీళ్ల సమస్య ఎక్కువున్నది. డ్యూటీకి పోయి వచ్చినంక మళ్ల నీళ్ల డ్యూటీ చేసుడు. బాగా ఇబ్బందైతంది. పక్కనే గోదావరి నది పారుతున్నా మాకు గుక్కెడు నీళ్లు ఇస్తలేరు. ఇటు ఎన్టీపీసోళ్లుగానీ, అటు కార్పొరేషనోళ్లు గానీ పట్టించుకుంటలేరు. మమ్ముల్ని ఇట్లనే బతుకుమంటరా?
సోమారపు : బాబూ.. నీ బాదేంది ?
నంబయ్య : సార్, ఇంటి ముందట మురుగు కాల్వతో ఇబ్బంది పడుతున్నం. పందులతో రోజూ పరేషాన్ అయితంది. జరాలొచ్చి సచ్చిపోతున్నం. జర పట్టించుకోండి సార్.
సోమారపు : అమ్మా.. మంచిగున్నరా?
వెంకటతార : నాకు ఇల్లు లేదు. కిరాయికుంటు న్న. ఆధార్‌కార్డు లేదని రేషన్ బియ్యం పోత్తలే రు. నలుగురు ఆడపిల్లలు. బతుకు ఎల్లదీస్తన్న. ఇంట్ల మూగపిల్ల ఉన్నది. ఆమెకు పెన్షన్ ఇస్తలేరు. సాయం చేయండి. నీ కాళ్లుమొక్కుత.
సోమారపు : తప్పకుండా అధికారులకు చెప్పి పెన్షన్ ఇప్పిస్తానమ్మా.
సోమారపు : నువ్వే కాల్వలు తీస్తున్నవేంది?
చిలుముల గట్టయ్య : ఇండ్ల ముందట కట్టిన ఓపెన్ డ్రెయినేజీలల్ల చెత్త నిండిపోతంది. కార్పొరేషన్ వాళ్లు ఎప్పుడస్తరో తెల్వది. ఒగలమీద ఆధారపడితే పనికాదు కదా! అందుకే నేనే తీసుకుంటన్న.
సోమారపు : బాబూ! బోరు సరిగ్గా పని చేస్తుందా?
రామయ్య : పనిచేస్తంది సార్. ఈ బోరే మాకు దిక్కు. కార్పొరేషనోళ్లు, ఎన్టీపీసోళ్లు మంచినీళ్లను పంపుతలేరు. ఈ బోర్ నీళ్లనే తాగుతున్నం. ఇవి ఎట్లున్నా తాగక తప్పుతలేదు. రోడ్డుకుపోయి రోజు నీళ్లు తెచ్చుకునుడు కష్టమైతంది. ట్యాంకర్లతోటి నీళ్లు తెచ్చినా అవి కొంత మందికే సరిపోతున్నయ్.
సోమారపు : ఇంటింటికి మరుగుదొడ్లు లేవా ?
లింగయ్య : లేవు సార్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ లేక అందరూ బహిర్భూమికి బయటకే వెళ్తున్నరు. అంతకుముందు ఖాళీ జాగా బాగనే ఉండేది. పట్టాలున్నొళ్లు వాళ్ల జాగల చుట్టూ గోడలు కట్టుకున్నరు. ఇప్పుడు బహిర్భూమికి వెళ్లాలంటే చాలా దూరం పోవాల్సిందే.
సోమారపు : అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే మరుగుదొడ్లు కట్టుకుంటరా?
గట్టయ్య : మాకంత స్థోమత లేదు సార్. ఏదైనా స్కీం కింద మరుగుదొడ్లు కట్టించెటట్లు చూడుండి. అక్కడక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేయించుండ్రి.
సోమారపు : ఏమమ్మా... మీదేం సమస్య ?
నంద స్వరూప : రామయ్యపల్లె ఉన్నదా అంటే ఉన్నదన్నట్టుగానే ఉంది. కాల్వలు లేవు. చెత్త బండి వస్తలేదు. పక్కనే గోదావరి పారుతున్నా మంచినీళ్లు లేవు. మొన్న నెల రోజుల క్రితం నీళ్లను పంపించినట్టే చేసిండ్రు. మళ్ల ఇప్పుడు వస్తలేవు. ఎవలన్న ఒకలు పనికిపోకుండ ఉంటేనే బయటకుపోయి నీళ్లు తెచ్చుకునుడు. లేకపోతే బాయినీళ్లే దిక్కు.
సోమారపు: సింగరేణివల్ల ఇబ్బందులున్నయా?
ఎండి రహీం : పక్కనే మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ఉంది. ప్రతీ రోజు బొగ్గు కోసం బ్లాస్టింగ్ చేస్తుంటే ఆ ధాటికి మా ఇళ్లు కదులుతున్నయ్. చాలా ఇళ్లు పగుళ్లు తేలి ఎప్పుడు కూలుతాయో అన్నట్లుగా భయం భయంగా ఉంది.
సోమారపు : కార్పొరేటర్‌గా ఈ ప్రాంత సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ?
వెంగల పద్మలత : 5వ డివిజన్ పరిధిలోని చాలా సమస్యలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన. ముఖ్యంగా ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు వద్ద ట్యాంకు నిర్మించి ఐదేళ్లవుతున్నా ఇక్కడి ప్రజలు తాగునీటికి నోచుకోలేదు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ లేక చాలా మంది బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్నా గ్రామస్థాయి సౌకర్యాలకు కూడా నోచుకోలేదు.
-గోదావరిఖని
ఎమ్మెల్యే హామీలు
శాలపల్లి, రామయ్యపల్లి, మల్కాపురం గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పైప్‌లైన్‌కు మరమ్మతు చేయిస్తా. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కొత్తగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా.
శాలపల్లిలో ఎన్టీపీసీ పునరావాసం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా యాజమాన్యంతో చర్చిస్తా.ఈ మూడు గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాన్ని ఎన్టీపీసీ యాజమాన్యంతో చేయించేలా చూస్తా.
ఓపెన్ డ్రెయినేజీల్లో కాలువలు కుంగిపోతే ఇంజినీర్లతో చెక్‌చేయించి తిరిగి నిర్మింపజేయిస్తా.
చెత్త తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులతో మాట్లాడుతా.గోదావరి నది ప్రస్తుతం ఎండిపోతున్నందున భవిష్యత్‌లో ఇబ్బంది ఉండకుండా ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ రిజర్వాయర్‌కు వస్తున్న నీటిని ఎన్టీపీసీ సిస్టర్న్ నుంచి గ్రావిటీ ద్వారా కార్పొరేషన్‌కు తాగునీరు అందించేందుకు రూ.48 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆ నిధులు మంజూరైతే కార్పొరేషన్‌తోపాటు గ్రామాల్లో కూడా నీటికి ఇబ్బందులుండవు.