సాక్షి, హైదరాబాద్: అది వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి.. సీఎం కేసీఆర్ స్వయంగా దాన్ని ప్రారంభించారు.. అన్ని వసతులున్న ఆ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేందుకు దరఖాస్తు చేసింది.. ఆరు నెలలైనా ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు కనీసం తనిఖీలకు రాలేదు. చివరికి ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, వైద్య మంత్రి కార్యాలయంలో ఆరా తీసింది. దాంతో తనిఖీలు చేసి.. ఏడాది తర్వాత దరఖాస్తును పరిష్కరించారు.
ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్–ఎల్‌బీనగర్ ప్రాంతంలో మరో ప్రైవేటు ఆస్పత్రి.. అగ్నిమాపక శాఖ అనుమతి సైతం లేదు. ఆస్పత్రి ప్రారంభిం చగానే ఆరోగ్యశ్రీ కోసం దరఖాస్తు చేశారు. రెండు రోజుల్లోనే అధికారుల తనిఖీ పూర్తయింది. నెలలోపే అనుమతి కూడా మంజూరైంది. దీనికి కారణం ‘మామూలే’.. పైరవీలు, డబ్బులు.
పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం.. అధికారుల వైఖరితో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. వైద్యారోగ్య శాఖలోని కొందరు ముఖ్యలు.. తమకు ఇష్టమైన వారికి ఆరోగ్యశ్రీ ట్రస్టు బాధ్యతలు అప్పగించడం, వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఆరోగ్యశ్రీ లక్ష్యం నీరుగారిపోతోంది. సొంత ప్రయోజనాలు, ప్రైవేటు ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చడమే ప్రధాన ఉద్దేశంగా ఆరోగ్యశ్రీ ట్రస్టులోని అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలకు అత్యుత్తమ వైద్యం కోసం..
పేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. లక్షలాది మంది పేదలు ఈ పథకం కింద ఉచితంగా వైద్యం పొందారు. ప్రస్తుతం తెలంగాణలో 85 లక్షల పేద కుటుంబాల్లోని 2.75 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిపి సుమారు 949 రకాల వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 341 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలవుతోంది. వీటిలో 96 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి.
ఆస్పత్రుల ఎంపికలో కక్కుర్తి..
వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎప్పటికప్పుడు ఆస్పత్రులను ఎంపిక చేస్తుంది. వందల కోట్ల పథకం కావడంతో చాలా ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందించేందుకు పోటీపడుతున్నాయి. కొత్త ఆస్పత్రి నిర్మాణం పూర్తి కాగానే పథకం కింద సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆయా ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేసి.. తగిన సౌకర్యాలు, ప్రమాణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకుని.. వాటిని పథకం కింద ఎంపిక (ఎంపానెల్‌మెంట్) చేస్తుంది. ఇదే అధికారులకు అవకాశంగా మారుతోంది. ఆరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆస్పత్రులను మాత్రమే ఎంపిక చేయాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కనీస వసతులు లేకున్నా..
ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైనప్పుడు (2008లో) తెలంగాణలో 46 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందేవి. ప్రమాణాల ప్రాతిపదికన ఈ జాబితా పెంచాలని అప్పట్లోనే నిబంధనలు చేర్చారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల సంఖ్య ప్రస్తుతం 341కి చేరింది. అయితే గత రెండేళ్లుగా మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పైరవీలకు తెరతీశారు. అనుమతుల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే అని చెబుతున్నా.. ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి వచ్చి ‘మామూళ్లు’సమర్పించుకున్న ఆస్పత్రులనే ఎంపిక చేశారు. తగిన సౌకర్యాలు, ప్రమాణాలు లేకున్నా పలు ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సేవల జాబితాలో చేర్చారు. ప్రత్యేకమైన వైద్య నిపుణులు, పరీక్ష కేంద్రాలు, పడకల సంఖ్య పరిమితి, వీల్‌చైర్లకు మార్గాలు, అగ్నిమాపక అనుమతులు వంటివి కూడా లేకున్నా ఎంపిక చేశారు. ఇందులో భారీగా అవినీతి కూడా చోటు చేసుకుంది.
చర్యలు చేపట్టిన సర్కారు..
ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారుల తీరుపై భారీగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ఆలస్యంగా స్పందించింది. విచారణ చేపట్టి.. ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారిగా వ్యవహరించిన సీనియర్ వైద్యుడి వైఖరితోనే ఇదంతా జరిగిందని గుర్తించింది. ఆయనను పదవి నుంచి తప్పించి, అక్రమాల నియంత్రణపై దృష్టిపెట్టింది. ఆరోగ్యశ్రీ పథకం మొదలైనప్పటి తరహాలోనే ఐఏఎస్ అధికారికి సీఈవోగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పటికే ఎంపిక చేసిన ఆస్పత్రుల విషయంగా ఏ చర్యలు తీసుకుంటారు, ఇకనైనా అక్రమాలు ఆగుతాయా, ఆరోగ్యశ్రీ ట్రస్టులోని మిగతా అధికారుల తీరు మారుతుందా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సంఖ్య
ఏడాది ఆస్పత్రులు
2008 46
2014 216
2015 242
2016 271
2017 316
2018 341
Comments
Please login to add a commentAdd a comment