పైసల యావ.. కమీషన్ల హవా..! | corruption of Contractors | Sakshi
Sakshi News home page

పైసల యావ.. కమీషన్ల హవా..!

Published Mon, Jul 13 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

పైసల యావ.. కమీషన్ల హవా..!

పైసల యావ.. కమీషన్ల హవా..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్‌స్టేషన్లు పది ఉండగా, 33/11కేవీ సబ్‌స్టేషన్లు 300పైగా ఉన్నాయి...

విద్యుత్ కేబుళ్ల యూజీ, ఏబీ పనుల్లో కమీషన్ల దందా కొనసాగుతోంది. నాసిరకం కేబుళ్లతో పాటు వాటిని తక్కువ లోతులో అమర్చుతూ కాంట్రాక్టర్లు అందినకాడికి పైసలు దండుకుంటున్నారు. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. వెరసీ నాసిరకం కేబుళ్లతో విద్యుత్ సరఫరాలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
 
సాక్షి, సిటీబ్యూరో :
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 220 కేవీ సబ్‌స్టేషన్లు పది ఉండగా, 33/11కేవీ సబ్‌స్టేషన్లు 300పైగా ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు రెండు వేల ఫీడర్లు, 90 వేల కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ డిస్ట్రిబ్యూషన్ లైన్లు ఉన్నాయి. సబ్‌స్టేషన్ల నుంచి గృహాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ లైన్లన్నీ నేటికీ ఓవర్‌హెడ్ లైన్లే. నిజాం కాలం నాటి వైర్లు కావడంతో ఎండ తీవ్రతకు సాగుతూ, గాలివానకు తెగి పడుతున్నాయి.

కోర్ సిటీలో చాలా వరకు చెట్ల కొమ్మల మధ్యలో ఉండిపోయాయి. దీంతో తరచు షార్ట్‌సర్క్యూట్స్ ఏర్పడి ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి.  ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిస్కం భావించింది. చెట్ల కొమ్మలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎయిర్‌బంచ్‌డ్ (ఏబీ) కేబుళ్లు, హైటెన్షన్ ఓవర్‌హెడ్ లైన్స్ స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 306 కిలో మీటర్ల యూజీ కేబుల్ అమర్చగా, మరో 300 కిలో మీటర్లు ఏవీ కేబుల్స్ వేశారు. కేబుల్‌తో పాటు నాసిరకం పనుల వల్ల వేసిన కొద్ది రోజులకే ఒత్తిడిని తట్టుకోలేక కాలిపోతున్నాయి.
 
ట్రాన్స్‌కో, మాస్టర్ ప్లాన్ మధ్య సమన్వయలోపం..
అండర్ గ్రౌండ్ కేబుల్స్ తవ్వకాల విషయంలో ట్రాన్స్‌కో, మాస్టర్‌ప్లాన్ విభాగాల మధ్య  సమన్వయం లేదు. 11 కేవీ, 33 కేవీ పనులు మాస్టర్ ప్లాన్ పర్యవేక్షిస్తుంది. 130 కేవీ, 220 కేవీ, 400 కేవీ సబ్‌స్టేషన్ల పనులను ట్రాన్స్‌కో చూస్తుంది. కొత్తగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు 130 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం వీటి మధ్య యూజీ కేబుల్ అమర్చుతున్నారు. ఒకే శాఖలోని ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఒకరు తవ్విన కొద్ది రోజులకే మరొకరు తవ్వి ఒకరు వేసిన లైన్‌పైనే మరో లైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక కాంట్రాక్టర్ వాడిన ఇసుక, బండలనే మరో గుత్తేదారు వాడుతూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నాడు.

ఇలా ఒకే చోట రెండు మూడు సార్లు తవ్వకాలు జరపడం, నాసిరకం పనుల వల్ల కేబుళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇటీవలే పూర్తై పాటిగడ్డ సబ్‌స్టేషన్‌కు హుస్సేన్‌సాగర్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందు కోసం రెండు త్రీ కోర్ 33 కేవీ కేబుళ్లు వేస్తున్నారు. దీనికి 1.2 మీటర్లు లోతు తవ్వాల్సి ఉండగా, ఆ కాంట్రాక్టర్ ఐమాక్స్ నుంచి మింట్‌కంపౌండ్ వెళ్లే దారిలో అర మీటరు కూడా తవ్వలేదు. నిత్యం డిస్కం ఉన్నతాధికారులు సంచరించే ఈ ప్రాంతంలోనే పనులు ఇలా ఉంటే శివారు ప్రాంతాల్లో ఎంత నాసిరకంగా ఉంటున్నాయో ఇట్టే ఊహించవచ్చు.
 
నాణ్యతను పరీక్షించకుండానే బిల్లులు..
రోడ్డు కటింగ్‌కు కోర్‌సిటీ పరిధిలో మీటరుకు గరిష్టంగా రూ.6 వేలు జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తుంది. గుత్తేదారు తవ్వకం పనికి రూ.6 వేలపైగా  అందిస్తారు. కాంట్రాక్టర్ చేసిన పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోల్ సెల్ అధికారులు  కమీషన్లకు కక్కుర్తి పడి పనులను పర్యవేక్షించకుండానే గుడ్డిగా బిల్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ ల హబ్సీగూడ ఎన్జీఆర్‌ఐ వద్ద కేబుల్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కిమ్స్, హుస్సేన్‌సాగర్ మక్తా, బోయిన్‌పల్లి, జేబీఎస్, హస్మత్‌పేట్, పాపిరెడ్డి కాలనీ, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, కాచిగూడ, తాళ్లగడ్డ, ఉస్మానియా, జూబ్లిహిల్స్‌లోసమస్యలు తలెత్తాయి. తాజాగా చిలకలగూడ నుంచి బన్సీలాల్‌పేట సబ్‌స్టేషన్ వరకు వేసిన యూజీ కేబుల్ భోలక్‌పూర్ ప్రధాన రహదారిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement